పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం

Published Thu, Feb 1 2024 2:20 PM

Demolition of panchayat stone plaque In Nidamanur - Sakshi

నిడమనూరు: నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం దుండగులు ధ్వంసం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022సంవత్సరంలో విడుదల చేసిన రూ.20లక్షల నిధులతో గ్రామంలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం బుధవారంతో ముగియనుండడంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని సర్పంచ్‌ వంకా బ్రహ్మన్న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పూర్తి కాని పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని  స్థానిక కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భవనం ప్రారంభోత్సవం చేసేందుకు సర్పంచ్‌ వచ్చే సరికి  శిలాఫలకం ధ్వంసమై ఉంది. 

దీంతో సర్పంచ్‌ వంకా బ్రహ్మన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పంచాయతీలకు నిధులు విడుదల చేశామని, కాంగ్రెస్‌ వారు ఓర్చుకోలేకనే ఇలా శిలాఫలకాన్ని ధ్వంసం చేసారని ఆరోపించారు. శిలాఫలకాన్ని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు వేములపల్లి వెంకట్రావు, మద్దిపూడి రాంబాబు, కుంబం విజయ్, కంచి శ్రీను ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌  బ్రహ్మన్న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని డిగితే దూషించారని స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు వేములపల్లి వెంకట్రావు సర్పంచ్‌తో పాటు వంకా బ్రహ్మన్న, సత్యనారాయణ, నక్క సైదులు, కృష్ణమూర్తిపై మరో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.

ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు
గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
– వంకా బ్రహ్మన్న, సర్పంచ్, పార్వతీపురం

సమాచారం లేదు
పార్వతీపురం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురించి అధికారికంగా సమాచారం లేదు. భవనం పూర్తి అయిన తర్వాత ప్రాంరంభిస్తాం. భవనం పూర్తయినట్లు కూడా సమాచారం అందలేదు. 
– ప్రమోద్‌కుమార్, ఎంపీడీఓ, నిడమనూరు

Advertisement
Advertisement