రాఖీ పండుగ: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక | Sakshi
Sakshi News home page

రాఖీ పండుగ: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక

Published Mon, Aug 28 2023 7:13 PM

Detention Of T-9 Tickets For Four Days In TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టికెట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు టీ-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. అయితే, సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్ల అమలు యథాతథంగా కొనసాగుతుందని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్‌ఆర్టీసీ 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కి.మీ. టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీ-9-60 టికెట్‌ను రూ.100కు, టీ-9-30 టికెట్‌ను రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది.

టికెట్ల నిలుపుదలపై ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: వినాయక చవితిపై భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కీలక ప్రకటన

Advertisement
Advertisement