Sakshi News home page

సదరం ‘స్లాట్స్‌’ తిప్పలు!

Published Mon, May 15 2023 4:02 AM

Disability confirmation test only once a week - Sakshi

దివ్యాంగులకు సదరం ‘స్లాట్స్‌’ తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదరం శిబిరాలకు స్లాట్స్‌ అందని ద్రాక్షగా మారాయి. 15 రోజులకు ఒకసారి  విడుదల చేస్తున్న స్లాట్స్‌ ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది. 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఐదు సదరం శిబిరాల కేంద్రాలు ఉన్నాయి. వివిధ కేటగిరీ వైకల్యాల నిర్ధారణ శిబిరాలు వారానికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండటంతో దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవంగా శారీరక వైకల్యం, మానసిక రుగత్మ, వినికిడి లోపం, కంటి రుగత్మల లాంటి నాలుగు వైకల్యం నిర్ధారణ పరీక్షలు ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్వహిస్తోంది.

ఒక్కో వైకల్యానికి ఒక్కో కేంద్రాన్ని ప్రత్యేకంగా కేటాయించి వారంవారం శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. వికలత్వ నిర్ధారణ కోసం నాలుగు మెడికల్‌ బోర్డులు ఏర్పాటు చేసి శాశ్వత, తాత్కాలిక ప్రాతిపధికన సర్టిఫికెట్‌ జారీ చేస్తోంది. మానసిక వైక్యలం పరీక్షలకు రెండు కేంద్రాలు మాత్రమే నిర్వహిస్తోంది. నిలోఫర్‌ ఆస్పత్రిలో 18 సంవత్సరాల లోపు, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 18 సంవత్సరాల పై బడిన వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. 

మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్‌...  
కొత్తగా వైకల్య నిర్ధారణ పరీక్షలు కోసం మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సదరం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్‌ నెంబర్, వివరాలు నమోదుతో దరఖాస్తు చేసుకుంటే తేదీ, సమయం, కేంద్రంతో కూడిన స్లాట్‌ లభిస్తోంది.

స్లాట్‌ ప్రకారం దరఖాస్తుదారులైన దివ్యాంగులు మీ సేవ కేంద్రం రసీదు, ఆధార్‌ జిరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మెడికల్‌ రిపోర్ట్స్‌తో సదరం కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. స్లాట్‌ ప్రకారం సదరం క్యాంపునకు హాజరు కాకపోతే రెండు రోజుల తర్వాత తిరిగి  మీ సేవా ద్వారా స్లాట్‌ బుక్‌ చేసు కోవచ్చు. సదరం కేంద్రంలో సంబంధిత వైద్య బందం పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని నమోదు చేస్తోంది.  

వైకల్యంపైనే... 
మెడికల్‌ బోర్టు ఆన్‌లైన్‌ వివరాలను పరిశీలించి వైకల్యాన్ని నిర్ణారించిన తర్వాతనే తాత్కాలిక, శాశ్వత ధ్రువీకరణ పత్రాల జారీపై నిర్ణయం తీసుకుంటారు. తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలను ఒకటి, రెండు, మూ డు, నాలుగు సంవత్సరాల వరకు వర్తించేలా ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్‌ రెన్యువల్‌ కోసం కూడా తిరిగి స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని వైకల్య నిర్ణారణ పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. 

రిజక్ట్‌ అయితే అంతేనా? 
క్యాంపులో సదరం సర్టిఫికెట్‌ జారీ చేయటంలో అప్లికేషన్‌ రిజక్ట్‌ అయితే మళ్లీ స్లాట్‌ సమస్యగా తయారైంది. మానసిక, ఇతర ఇబ్బందులున్న చిన్న పిల్లలు, సర్టిఫికెట్‌ టెస్టులు టైంలో సహకరించకపోవడంతో డాక్టర్ల టీమ్‌ రిజక్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement