ప్రమాదంలోకి ప్రజారోగ్యం! సర్కార్‌ వారి హద్దులను చెరిపేస్తే ఎలా? | Sakshi
Sakshi News home page

ప్రమాదంలోకి ప్రజారోగ్యం! సర్కార్‌ వారి హద్దులను చెరిపేస్తే ఎలా?

Published Fri, Jul 14 2023 12:58 AM

Doctors anger over decision to train RMPs and PMPs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సర్కారుకు, డాక్టర్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయంపై వైద్యులు మండిపడుతున్నారు. వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలకు వాడుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పుబడుతున్నారు.

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు, తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల (జూడా) సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కౌశిక్‌ కుమార్‌ పింజరాల, హెల్త్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) అధ్యక్షుడు డాక్టర్‌ కె.మహేష్‌కుమార్‌లు వైద్యారోగ్య శాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

‘తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి డాక్టర్లను తయారు చేస్తున్న తరుణంలో ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌), పీఎంపీ (ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌)లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ వైద్యరంగంలో దయనీయ పరిస్థితికి ఇది ఉదాహరణ.

ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఆశ, ఏఎన్‌ఎం సహా ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను ఉపయోగించుకునే దిశగా ఎందుకు ఆలోచించడంలేదు? ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా? ఆధునిక వైద్యంపై అవగాహన లేని వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడం.. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేయడమే.

ఏళ్ల తరబడి ఆధునిక వైద్యం నేర్చుకున్న డాక్టర్లకు సర్కారు నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అనైతిక నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి బదులు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులను నియమించాలి..’ అని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లన్నింటినీ మూసివేయాలని ఐఎంఏ డిమాండ్‌ చేసింది. 

శస్త్రచికిత్సలు చేయడంపై అభ్యంతరం...
రాష్ట్రంలో వేలాది మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఉన్నారు. అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా గ్రామీణ స్థాయి వరకు అవి అందుబాటులో లేవు. పైగా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణులకు ఆర్‌ఎంపీలు, పీఎంపీల వైద్య సేవలే దిక్కవుతున్నాయి.

అయితే చాలామంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక చికిత్సకే పరిమితం కాకుండా, చిన్నపాటి శస్త్రచికిత్సలు, ప్రసవాలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్తూ కమీషన్లు పొందుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు అనేకచోట్ల ఆర్‌ఎంపీలు, పీఎంపీల వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే వారికి శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, కొన్ని పరిమితులతో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేలా చూడాలన్నది తమ ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం.. ప్రజారోగ్యాన్ని అనర్హులైన వారి చేతిలో ఉంచడమే అవుతుందని డాక్టర్లు మండిపడుతున్నారు. ‘ఇది అమలైతే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్దకు వెళతారు.

వారు తెలిసీ తెలియని వైద్యం చేసి వికటించినప్పుడు, వారు ఆ కేసులను డాక్టర్ల వద్దకు పంపిస్తారు. కానీ అప్పటికే రోగి పరిస్థితి విషమిస్తుంది. ఆ తర్వాత  ఏదైనా జరిగితే డాక్టర్లపైకే నెట్టేస్తారు..’ అని అంటున్నారు. ప్రాథమిక చికిత్సకు మాత్రమే పరిమితమం కావాల్సిన వారు తమ హద్దులను దాటుతున్నారని, మందులు రాయడం వంటివి కూడా చేస్తున్నారని వివరిస్తున్నారు.

ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం ద్వారా ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్యాన్ని పణంగా పెడుతోందని అంటున్నారు. వారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక ఇన్ని మెడికల్‌ కాలేజీల అవసరం ఏముందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement
Advertisement