మత్తు వదిలించేలా..  | Sakshi
Sakshi News home page

మత్తు వదిలించేలా.. 

Published Thu, Dec 28 2023 5:43 AM

EC caning of police officers who violate the rules - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  మత్తు మహమ్మారిని తుద ముట్టించేందుకు ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర యువతపై పంజా విసురుతున్న గంజాయి, డ్రగ్స్‌ పీడ వదిలించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్‌ బ్యూరో ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ఈ ఏడాది నుంచే మత్తు కట్టడిపై ప్రభుత్వం యుద్ధభేరి మోగించినట్టు అయ్యింది.

టీఎస్‌ న్యాబ్‌ (తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ బ్యూరో) డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్య బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే మూడు దశాబ్దాలుగా ఆల్ఫాజోలం మత్తుదందా చేస్తున్న నిందితులను వెలుగులోకి తేవడమే కాదు రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికలు ఫలించాయి.

నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్‌పీఎస్సీ వరుస పేపర్‌ లీకేజీలపై కేసుల నమోదు సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగడంతో దాదాపు సగం సమయం ఎన్నికల కసరత్తు, ఎన్నికల విధుల్లోనే పోలీసులు గడిపారు.  

ఈ ఏడాదిలో నమోదైన కొన్ని ప్రధాన నేర ఘటనలు  
♦ ఫిబ్రవరి 23న వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీజీ ఫస్టియర్‌ విద్యార్థిని ధరావత్‌ ప్రీతి సీనియర్‌ సైఫ్‌ వేధింపులతో ఆత్మహత్యకు యతి్నంచగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27న            చనిపోయింది.  
♦ ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్‌మెట్‌ స్టేషన్‌ పరిధిలో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను తోటి విద్యార్థి హరిహరకృష్ణ హత్య చేసి తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి, వాటిని                  తగులబెట్టాడు.  
♦ఈ ఏడాదిలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం అత్యంత కీలకమైంది. తొలుత టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్షపత్రం లీకేజీపై మార్చి 10న టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రెటరీ సత్యనారాయణ ఫిర్యాదుతో తొలుత కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా అనేక పరీక్షల లీకేజీ బయటపడడంతో ప్రభుత్వం మార్చి 14న హైదరాబాద్‌ సిటీ అడిషనల్‌ సీపీ క్రైమ్స్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిట్‌ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది.  
♦ మార్చి 16 సాయంత్రం సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 మందిని అగి్నమాపకశాఖ సిబ్బంది కాపాడింది.  
♦ మార్చి 11న ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. 
♦ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీచేసి సైబర్‌ నేరగాళ్లకు అమ్ముతున్న 12 మంది సభ్యుల ముఠాను ఈ ఏడాది మార్చి 23న సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.  
♦ ఒక నైజీరియాతో సహా నలుగురు సభ్యుల ముఠాను మే 7న అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు వారి నుంచి రూ.1.30 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు 
♦ మే నెలలో కుషాయిగూడలోని ఓ టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదేళ్ల కుమారుడు సహా దంపతులు సజీవ దహనం అయ్యారు.  
♦ అప్పు తిరిగి చెల్లించే విషయంలో వచి్చన వివాదంతో మలక్‌పేటలో మాజీ హెడ్‌నర్స్‌ అనురాధారెడ్డిని చంద్రమోహన్‌ మే 15వ తేదీ రాత్రి హత్య చేసి, శరీరభాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో 13 రోజులు దాచి, ఆ తర్వాత వాటిని మూసీనదిలో వేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.  
♦ దేశవ్యాప్తంగా వందలమందిని ముంచిన ఈ–స్టోర్‌ ఇండియా సంస్థ రూ.1,000 కోట్ల మోసాన్ని మే 30న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.  
♦ మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మే 31న దండకారణ్యం గెరిల్లా జోన్‌లో గుండెపోటుతో మరణించారు.  
♦ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పరను పూజారి సాయికృష్ణ రాయితో మోది దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సరూర్‌నగర్‌ మండల ఆఫీస్‌ వెనుక ఉన్న పాత సెఫ్టిక్‌ ట్యాంక్‌లో వేసి ఉప్పు, ఎర్రమట్టి నింపిన ఘటన సంచలనం సృష్టించింది.  
♦ ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తికర్‌ అహ్మద్‌పై ఆ కానిస్టేబుల్‌ దంపతులు జగదీశ్, శకుంతల, మరో వ్యక్తి కృష్ణలు దాడి చేసి అతడి మర్మాంగాలు కోశారు. తీవ్రంగా గాయపడిన సీఐ చికిత్స పొందుతూ              మరణించాడు.  
♦ తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మిని్రస్టేషన్‌ (డీసీఏ) డిసెంబర్‌ 6న మచ్చ బొల్లారంలో జరిపిన సోదాల్లో రూ 4.3 కోట్ల విలువైన యాంటీ కేన్సర్‌ నకిలీ మందులను గుర్తించారు. 
♦ డిసెంబర్‌ 8న సంగారెడ్డి జిల్లాలో టీఎస్‌ న్యాబ్‌ సోదాల్లో డ్రగ్‌ తయారీ కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 
♦ఏడాది డిసెంబర్‌ 14న ఖమ్మం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముగ్గురు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.1.22 కోట్ల విలువైన 484 కిలోల గంజాయిని టీఎస్‌ న్యాబ్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  
♦ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పుల ఊబిలో చిక్కిన సిద్దిపేట కలెక్టర్‌ గన్‌మన్‌ నరేశ్‌ డిసెంబర్‌ 15న చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కుమారుడు రేవంత్, కుమార్తె రిషిత, భార్య చైతన్యలను కాల్చి, తను ఆత్మహత్య చేసుకున్నాడు. 

నేర నియంత్రణలో కీలక అడుగులు  
♦ఓవైపు పెరుగుతున్న సైబర్‌ నేరాలు, మరోవైపు రాష్ట్ర యువత భవిష్యత్‌కు ముప్పుగా మారిన మత్తు మహమ్మారి కట్టడికి ఈ ఏడాదిలోనే కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏబీ), తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలు మే 31న ప్రారంభమయ్యాయి.  
♦ బస్‌లో భరోసా పేరిట రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఈ ఏడాది ఆగస్టు 15న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోణంలో ఇదో నూతన ఆవిష్కరణ.  
♦ మొబైల్‌ ఫోన్‌ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా..తిరిగి గుర్తించేందుకు తెలంగాణ పోలీసుల టెలికమ్యూనికేషన్స్‌ విభాగం రూపొందించిన సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టార్‌ (సీఈఐఆర్‌) యాప్‌ వాడడం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఈనెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,024 మొబైల్‌ఫోన్లు గుర్తించి దేశంలోనే నంబర్‌వన్‌గా  నిలిచారు.  
♦ పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రత విభాగం ఈ ఏడాది మే 20న ‘సాహస్‌’వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. 

ఎన్నికల కమిషన్‌ కొరడా.. అనూహ్య బదిలీలు  
♦ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్‌ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొంచెం గట్టిగానే కొరడా ఝుళిపించింది. అక్టోబర్‌ 9న రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ వచ్చిన మూడు రోజుల తర్వాత ఏకంగా 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  
♦ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం అనూహ్యంగా సస్పెన్షన్‌ వేటు వేసింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం..పోలీస్‌శాఖలోని కీలక బదిలీలు వరుసగా జరిగాయి. 

Advertisement
Advertisement