వరంగల్‌కు మంచి భవిష్యత్తు ఉంది : ఎర్రబెల్లి | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు మంచి భవిష్యత్తు ఉంది : ఎర్రబెల్లి

Published Wed, Aug 19 2020 7:58 PM

Errabelli Dayakar rao fires on oppositions - Sakshi

సాక్షి, వరంగల్‌ : వరదల విషయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై మాటల బురద చల్లటం సరైన పద్ధతి కాదని బాధ్యత ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు సలహాలు ఇవ్వాలని సూచించారు. వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరంగల్‌కు చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించడం సరైంది కాదని, వరంగల్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఎర్రబెల్లి అన్నారు. రానున్న రోజుల్లో మొత్తం హైదరాబాద్ కంటే ఎక్కువగా వరంగల్‌కు అవకాశాలు వస్తాయని తెలిపారు. ఎంజీఎంపై కూడా ప్రతిపక్ష పార్టీలు తప్పుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పేదలు ఎంజీఎంకు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
 
అసత్య ప్రచారాలను ఎవ్వరు నమ్మకూడదని ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్‌కు అన్ని రకాల అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో 5 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని, అందులో 212 మీ.మీలతో హన్మకొండ మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా ప్రజలను కాపాడుకోగలిగామన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ఏపార్టీకి చెందిన వారైనా సరే నాలలపై అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు. దీని కోసం  అధికారులతోనే కమిటీ వేశామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా చూసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement