కలెక్టర్‌ ఆరోపణలు అసత్యం: ఈటల జమున

6 Dec, 2021 20:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణిలో నమోదైన తర్వాతే భూములు కొన్నామని ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున అన్నారు. రాజకీయ అక్కసుతోనే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈటల భూ వ్యవహారంపై మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ప్రెస్‌మీట్‌పై ఆమె స్పందిస్తూ.. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే భూములు కొన్నామని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది.  ప్రెస్‌మీట్‌ ఎలా పెడతారు. ప్రెస్‌మీట్‌ పెట్టడానికే కలెక్టర్లు ఉన్నారా అని ఈటల జమున ప్రశ్నించారు.

చదవండి: గోవాలో ఎంజాయ్‌ చేస్తున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లు, వీడియో వైరల్‌

‘‘సర్వే నెంబర్ 81లో మాకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారని అసత్యాలు చెబుతున్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. టీఆర్ఎస్ కండువా కప్పుకొని కలెక్టర్లు పని చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

‘‘2018లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మించాం. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమిని ఇప్పుడు ప్రైవేటు భూమిగా చూపిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు హ్యాచరీస్ ఉన్నాయి. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటల రాజేందర్‌ను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు  మానుకోవాలని ఈటల జమున హితవు పలికారు.

మరిన్ని వార్తలు