Sakshi News home page

రైతుల ‘వేలం’వర్రీ!

Published Thu, Apr 18 2024 4:28 AM

Farmers worried about behavior of cooperative banks on loan collection - Sakshi

రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో అన్నదాతల ఆందోళన

రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డీసీసీబీలు 

అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూముల వేలం 

వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం 

పరువు పోతోందంటూ రైతన్నల ఆవేదన  

ఆర్బీఐ నిబంధనల ప్రకారమే: టెస్కాబ్‌

సాక్షి, హైదరాబాద్‌: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

రైతుల విషయంలోనే కఠిన వైఖరి? 
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్‌ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి.

రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి.

మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 202 మందికి నోటీసులు 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్‌ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్‌లో ఉన్న 202 మందికి బ్యాంక్‌ అధికారులు లీగల్‌ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. 

నిజామాబాద్‌లో 71 మందికి 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.  

ఖమ్మం జిల్లాలో కూడా.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్‌లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి 
రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. 
– నేతి మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్‌  

– నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్‌లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. 

– జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్‌) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్‌ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్‌ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. దీంతో చంద్రకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్‌ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్‌ తమ ట్రాక్టర్‌ సీజ్‌ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్‌మార్క్‌లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement