కాసులకు కక్కుర్తిపడి కడుపులోనే కరిగిస్తున్నారు! | Sakshi
Sakshi News home page

కాసులకు కక్కుర్తిపడి కడుపులోనే కరిగిస్తున్నారు!

Published Tue, May 30 2023 1:04 AM

Feticide of female babies in mother womb - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు, వైద్య సిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ కడుపులోని బిడ్డను కరిగించేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని లింగనిర్ధారణ పరీక్షల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు.

రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు, సెంటర్లపై పోలీసులతో కలిసి డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

దీంతో కొంతకాలం దందాకు అడ్డుకట్టపడింది. అనంతరం మళ్లీ ఈ దందా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సాగుతోంది. దీనిని అరికట్టకపోతే 2031 జనాభా లెక్కల నాటికి అడపిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు 
గర్భస్థ లింగ నిర్ధారణ నేరం అని అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో బోర్డు కనిపిస్తుంది. కానీ ఆయా కేంద్రాల నిర్వాహకులు, వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆడశిశువులు భ్రూణహత్యకు గురవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. 2011లో దేశంలోని మొత్తం జనాభాలో 2.89 శాతం.



జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం 2021లో తెలంగాణ జనాభా 3,77,25,000 కాగా, 2031 నాటికి 3,92,07,000కు చేరుకోగలదని అంచనా. ఇవి 2021, 2031 సంవత్సరాల్లో వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం, 2.66 శాతం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి (ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య) 988 కాగా, వివిధ జిల్లాల్లో ఇది 950 నుంచి 1046 వరకు నమోదైంది. 

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు 
పోలీసు శాఖ సహకారంతో స్కానింగ్‌ సెంటర్లపై డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. సంబంధిత చట్టంపై ఆరోగ్య సిబ్బంది ద్వారా గర్భిణులకు అవగాహన కల్పిస్తాం. మొదట ఆడ సంతానం కలిగి ఉండి తిరిగి గర్భం దాల్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. స్వచ్ఛంద సంస్థలు ఐసీడీఎస్, మెప్మాతో కలిసి స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచుతాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 104 లేదా 1098 లేదా డయల్‌ 100కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. 
–డాక్టర్‌ సాంబశివరావు,డీఎంహెచ్‌ఓ, హనుమకొండ 

బేటీ బచావో బేటీ పఢావోతో అవగాహన 
బాలురకు దీటుగా బాలికల సంఖ్యను పెంచేందుకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అవకతవకలకు పాల్పడే స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నాం.  
–సంతోష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి  

Advertisement
Advertisement