ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి  | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన ప్రాణహిత, గోదావరి 

Published Sat, Aug 15 2020 3:35 AM

Flood Water Flow Increasing In Godavari - Sakshi

కాళేశ్వరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కలుస్తోంది. ఎగువన అన్నారం (సరస్వతీ) బ్యారేజీ గేట్లు ఎత్తడంతో దిగువకు వచ్చే గోదావరి జలాలు కూడా కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల వరద పుష్కర ఘాట్లను తాకుతూ 8.3 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శుక్రవారం బ్యారేజీలో ని 85 గేట్లకు గాను 57 గేట్లు ఎత్తి వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువన గోదావరి, ప్రాణహిత నదుల ద్వారా 2,91,200 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు 2.42,500 క్యూసెక్కుల నీరు తరలుతోందని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

అలాగే.. అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలోకి స్థానిక వాగుల ద్వారా భారీగా నీరు వచ్చి చేరుతోంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌ హౌస్‌ ద్వారా ఎత్తిపోతలను నిలిపివేశారు. బ్యారేజీలో మొత్తం 66 గేట్లకు గాను 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా 9.20 టీఎంసీలతో నిండుకుండలా మారింది.  ఈ బ్యారేజీకి సుమారు 30కి పైగా వాగుల ద్వారా ఇన్‌ఫ్లో 36,480 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తడంతో 29,700 క్యూసెక్కుల వరద దిగువ కాళేశ్వరం వైపునకు వెళ్తోంది.  సాయంత్రంగా ఐదు గేట్లను మూసివేశారు. భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారమ్మ కాగా, భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 40.3 అడుగులకు చేరింది. 

గంట గంటకూ పెరుగుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద ఉదయం 10 గంటలకు 7.13 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు 7.26 మీటర్లు, సాయంత్రం 4 గంటలకు 7.34 మీటర్లు, సాయంత్రం 5 గంటలకు 7.40 మీటర్లకు చేరింది. ఇలా గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలసి ఏటీడీఏ పీఓ హనుమంత్, ఏఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ పరిశీలించి సహాయక చర్యలపై చర్చించారు. అలాగే, వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ఏటూరునాగారం తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పనిచేసే ఈ కంట్రోల్‌ రూంను 80080 60434 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement