Gated Community People Use Mylo And MyGate App- Sakshi
Sakshi News home page

మైలో, మైగేట్‌కు పెరుగుతున్న ఆదరణ.. ఇంతకు ఏంటివి

Published Wed, Dec 8 2021 12:05 PM

Gated Community People Use Mylo And MyGate App - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ సిటీలో ఇప్పుడు మొబైల్‌ యాప్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. వందలకొద్దీ కుటుంబాలు నివాసం ఉండే గేటెడ్‌ కమ్యూనిటీల్లో వీటికి ఆదరణ మరింత పెరిగింది. ఇరుగు..పొరుగు ఎవరుంటారు? వారి ఇష్టాఇష్టాలేమిటి? రోజువారీగా ఈ సముదాదాల నివాసాలకు బయటి వ్యక్తులు ఎవరు.. ఎప్పుడు వస్తున్నారు.. వంటి సమస్యలను పరిష్కరించేందుకు సపర్‌లోకల్‌ మొబైల్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వారి కోసం మైలో, మైగేట్‌ వంటి సూపర్‌ మొబైల్‌యాప్‌ల వినియోగంలోకి రావడంతో నగరవాసులకు ప్రతి పనీ సులభతరమవుతుండడం విశేషం. 

మైలోకు.. మహా ఆదరణ 
మియాపూర్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివసిస్తున్న వెంకట్‌కు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడమేకాదు.. వీలుంటే క్రికెట్‌ ఆడేందుకు స్నేహితులను కలుపుతోందీ ఈ ‘మైలో’ మొబైల్‌యాప్‌. నగరానికి చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్‌ను పలు గేటెడ్‌ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గరచేయడం, ఇష్టాయిష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం. కష్ట సుఖాలు షేర్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ ఓ అవకాశం కల్పిస్తుండడం విశేషం. 

ఇది యాప్‌ల కాలమనీ.. 
►నెటిజన్లుగా మారిన మహానగర సిటీజన్లు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు.. రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలను ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. 
►ఆహారం, ఔషధాలు, వైద్యసేవలు, వైద్యపరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్‌ తదితర అవసరాలను తీర్చే యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు సపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి ఇటీవలి కాలంలో విశేష ప్రజాదరణ పొందుతుండడం నయా ట్రెండ్‌గా మారింది. 

మై గేట్‌తో మరో సౌలభ్యం..  
►గేటెడ్‌ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తున్న మరో యాప్‌ ‘మైగేట్‌’ మొబైల్‌ యాప్‌. ఈ యాప్‌ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, వర్కెటింగ్‌ సిబ్బంది తదితరులు ఎవరు..ఏయే సమయాల్లో వచ్చారు? పిల్లల స్కూల్‌ వ్యాన్‌ ఏ సమయానికి వస్తుంది? క్యాబ్‌ సర్వీసులు ఏ సమయంలో లోపలికి వచ్చాయి? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పని చేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి..మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్‌ రూపంలో మొబైల్‌కు అందనుండడం విశేషం. 
►ఈ యాప్‌లు భద్రమే కాకుండా.. ఆయా పనులను సులభతరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళరు, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో సపర్‌లోకల్‌ మొబైల్‌ యాప్‌లను గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. నగరంలోనూ ఈ ట్రెండ్‌ ఇటీవలి కాలంలో జోరందుకుందని చెబుతున్నారు.
 

Advertisement
Advertisement