షాడో టీమ్స్‌.. ఎత్తుకు.. పై ఎత్తులు!

25 Nov, 2020 09:17 IST|Sakshi

ప్రత్యర్థులు, రెబల్స్‌పై అభ్యర్థుల కన్ను 

ఎన్నికల నేపథ్యంలో వారి ఎత్తులపై ఆరా 

వాటిని బట్టి పైఎత్తులు వేసేలా ప్రణాళికలు 

కోవర్ట్‌ ఆపరేషన్ల సమాచార సేకరణపై దృష్టి  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వేసే ఎత్తులకు ప్రత్యర్థులు పైఎత్తులు వేయడం మూమాలే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎత్తుల్ని తెలుసుకోవడం కోసం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు తాము ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచుతున్నారు. ప్రత్యర్థులతో పాటు రెబల్స్‌ పైనా దృష్టి పెడుతున్నారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి ‘కోవర్ట్‌ ఆపరేషన్లు’ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోటాపోటీ చర్యల నేపథ్యంలో ఎలాంటి అపశృతులు, శాంతిభద్రతల సమస్యలు, ఉద్రిక్తతలకు తావు లేకుండా పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

లోగుట్టు కనిపెట్టడానికే..   
ప్రతి పార్టీ అభ్యర్థి పోటీదారుడిని వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ప్రచారం, ఎవరిని కలుస్తున్నారనే అంశాలతో పాటు వారికి సంబంధించిన అడ్డాలపై పూర్తి సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. ప్రలోభాలకు అవసరమైన సామగ్రి, మద్యం, నగదు సమీకరణ పూర్తయిందా? వాటిని ఆయా అభ్యర్థులు ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటున్నారని తెలిసింది. ఈ వివరాలు తెలిస్తే పోలీసులకు, ఎన్నికల సంఘానికి పరోక్షంగా సమాచారం ఇచ్చి వారిని దెబ్బతీయాలన్నది వీరి వ్యూహం అనేది నిర్వివాదాంశం. 

ప్రతి కదలికనూ గమనిస్తూ... 
రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్య కార్పొరేటర్‌ సీట్ల కోసం ఏర్పడిన విపరీతమై పోటీయే ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించేలా చేస్తోంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఎదుటి పార్టీ, పోటీ అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏమి హామీలు ఇస్తున్నారు? ప్రలోభాల పర్వం మొదలైందా? తదితర అంశాలు స్పష్టంగా తెలిస్తేనే వాటిని దీటుగా తిప్పికొట్టడంతో పాటు ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనేది అభ్యర్థుల భావన. దీనికోసం వారు అందుబాటులో ఉన్న ఉన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ ప్రత్యర్థులు, రెబల్స్‌కు చెందిన ప్రతి కదలికనూ 
గమనిస్తున్నారు.  

నమ్మినవారికే ఆ బాధ్యతలు... 
తమ వ్యూహాన్ని అమలులో పెట్టేందుకు ప్రస్తుతం అభ్యర్థులకు అవకాశం లేదు. వారు ప్రచార హడావుడిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారు తమకు నమ్మినబంటుగా ఉండే తమ అనుచరులకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. వీరు తమ అభ్యర్థి కోసం పని చేసినా, చేయకున్నా... ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నాడనేది తెలుసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొందరితో కలిసి షాడో టీమ్స్‌ మాదిరిగా పని చేస్తూ ఎప్పటికప్పుడు తమ వారికి అప్‌డేట్స్‌ అందిస్తున్నారు. నిత్యం పోటీదారుపై కన్నేసి ఉంచాల్సిన బాధ్యతల్ని ఈ షాడో టీమ్స్‌కు అప్పగిస్తున్నారని సమాచారం. 

ఆ ‘కుట్ర’లకూ తెగబడుతూ? 
తన వేగుగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంట తిరిగే వ్యక్తిని అతడు గుర్తించకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న కొందరు అభ్యర్థులు ఏకంగా కోవర్ట్‌ ఆపరేషన్లు ప్రారంభించారు. పోటీదారుడి వెనుక తిరుగుతున్న, అతడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు వివిధ రకాలైన ఎరలు వేస్తున్నారని తెలిసింది. వారి నుంచే ప్రత్యర్థులు/రెబల్స్‌ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఇలా కోవర్ట్‌ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ముడుతున్నాయని వినిపిస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు