జీహెచ్‌ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’! | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో ఐఫోన్‌-12 సిరీస్‌ లొల్లి..!

Published Fri, Dec 18 2020 6:01 PM

GHMC To Gift Iphones To Its Standing Committee Members - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాలపై వివాదం నెలకొంది. ఐ ఫోన్లు కావాలంటూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల పట్టు బట్టినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు ఐఫోన్‌ 12 సిరీస్‌ మొబైల్స్‌ కొనుగోలు చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం. స్టాండింగ్‌ కమిటీలోని 17 మంది సభ్యులకు తలా ఒక ఐఫోన్‌ను ‘బహుమతి’గా ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో మొబైల్‌ విలువ 1.6 లక్షలు. ఈ మొత్తం వ్యవహారానికి 27 లక్షల రూపాయలకు పైగా వ్యయం కానుంది. అయితే, మార్కెట్‌లో ఐఫోన్‌-12 మ్యాక్స్‌ ప్రో (ఇంటర్నల్‌ మెమొరీ 512 జీబీ)‌ మొబైల్స్‌ స్టాక్‌ లేకపోవడంతో కొనుగోలును జీహెచ్‌ఎంసీ వాయిదా వేసిందట. దాంతో తమకు మొబైల్స్‌ అందవేమోనని స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కలవరపడుతున్నారట. మరో 45 రోజుల్లో ప్రస్తుత గ్రేటర్‌ పాలకమండలి గడువు ముగియనుండటమే ఈ కలవరపాటుకు కారణం! 
(చదవండి: ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..)

తీవ్ర విమర్శలు
స్టాండింగ్‌ కమిటిలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ మరో 15 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సభ్యులు. జీహెచ్‌ఎంసీలో స్టాండింగ్‌ కమిటీదే కీలక పాత్ర. ఇక ఈ బహుమతుల కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కారు పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనడానికి తాజా బాగోతమే ఉదాహరణ అని బీజేపీ హైదరాబాద్‌ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావు అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ ఇంత ఖర్చు చేసి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని నీళ్లలాగా ఖర్చు చేస్తున్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి సభ్యులు సిగ్గుపడాలని చురకలు వేశారు. ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందని మీడియాతో శుక్రవారం పేర్కొన్నారు. కాగా, గ్రేటర్‌ నూతన పాలక మండలి ఫిబ్రవరిలో కొలువుతీరనుంది.
(చదవండి: ఇక హైదరాబాద్‌లో ఫ్రీ వాటర్‌.. అయితే..)

Advertisement
Advertisement