నిరుపేద చిన్నారి.. దాతల సాయం కోరి..! | Sakshi
Sakshi News home page

నిరుపేద చిన్నారి.. దాతల సాయం కోరి..!

Published Wed, Aug 19 2020 11:33 AM

Girl Child Naveena Suffering With Liver Problem Waiting For Help - Sakshi

బుడిబుడి అడుగుల చిన్నారికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

చెన్నూర్‌: తమ చిన్నారిని కాపాడమని మహేందర్, లక్ష్మి దంపతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తలా కొంత సాయం చేసి తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

అభం, శుభం తెలియని చిన్నారి
అందరితో కలిసి ఆనందంగా ఆడుకునే అభం, శుభం తెలియని చిన్నారి ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతోంది. కన్నవారు అష్టకష్టాలు పడుతూ స్థోమతకు మించి  అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్‌ పట్టణం బట్టిగూడెం కాలనీకి చెందిన మహేందర్, లక్ష్మిలకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి నవీన (3). రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. మహేందర్‌ టాటాఏస్‌ డ్రైవర్‌గా పని చేస్తుండగా లక్ష్మి కూలీ చేసి బతుకు బండిని లాగుతున్నారు. ఇద్దరూ కష్టపడి పిల్లలను కంటికి రెప్పలా సాకుతున్నారు. కానీ పది రోజుల క్రితం నవీనకు జ్వరం వచ్చింది. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నవీనకు డెంగీ లక్షణాలున్నాయని, కరీంనగర్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన చిన్నారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారి నవీనకు  పరీక్షలు నిర్వహించి గుండెలాగేలా... ఆ చిన్నారి డెంగీతో పాటు లివర్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుందని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. గురువారం నుంచి చికిత్సకు రోజుకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చవుతోంది. ఇప్పటికే రూ. 4.80 లక్షలు ఖర్చయ్యాయని.. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పుచేసి నెట్టుకొచ్చామని, ప్రస్తుతం అప్పులిచ్చేవారు కూడా లేరని చిన్నారి తండ్రి మహేందర్‌ అంటున్నారు. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. 

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఇప్పటికే చిన్నారి వైద్య ఖర్చులకు రూ. 5 లక్షలకు పైగా ఖర్చయింది. ఇంకా నాలుగు నుంచి రూ. 5 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ఆత్రుత పడుతున్నారు. కానీ అంతంతమాత్రంగా ఉన్న వారి ఆర్థికస్థోమతను చూసి ఎలాగా అని భయపడుతున్నారు. ఆపన్నహస్తం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. 

వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం
చిన్నారి నవీన వైద్య ఖర్చుల కోసం చెన్నూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.  

నెన్నల కృష్ణ, 
అకౌంట్‌ నంబర్‌: 62297400611
ఐఎఫ్‌ఎస్‌సీ: SBIN0020128
స్టేట్‌బ్యాంక్, చెన్నూర్‌ బ్రాంచ్,గూగుల్‌పే: 8096384756 

Advertisement
Advertisement