'భయో' ఫెర్టిలైజర్‌ | Sakshi
Sakshi News home page

'భయో' ఫెర్టిలైజర్‌

Published Thu, Jan 11 2024 4:47 AM

Gold compost is a burden for farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బయో ఫెర్టిలైజర్‌ పేరిట బలవంతంగా ‘గోల్డ్‌ కంపోస్ట్‌’తమకు అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి కొనాల్సిందేనని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్‌) ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో బహుళజాతి కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నా, గోల్డ్‌ కంపోస్ట్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గ్రోమోర్‌ కంపెనీకి చెందిన బయో ఫెర్టిలైజర్‌ 40 కేజీల బస్తా రూ. 300 వరకు మార్కెట్‌లో ఉండగా, స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే ‘మార్క్‌ఫెడ్‌ గోల్డ్‌ కంపోస్ట్‌’ధర మాత్రం ఏకంగా రూ. 472 ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్‌ నుంచి ఒత్తిడి పెరగడంతో ప్యాక్స్‌లు గోల్డ్‌ కంపోస్ట్‌ను కొనుగోలు చేయక తప్పడంలేదు. అయితే రైతులు కొనుగోలు చేయనిచోట ఆ మేరకు ప్యాక్స్‌ల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి.

గత వానాకాలం సీజన్‌ నుంచి పూర్తిస్థాయిలో దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో అప్పటినుంచి ఈ ఫెర్టిలైజర్‌ను అంటగట్టే పనిలో మార్క్‌ఫెడ్‌ నిమగ్నమైంది. జిల్లాల్లోని మార్క్‌ఫెడ్‌ మేనేజర్లకు ఇండెంట్‌ పెట్టి మరీ దీనిని విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, డీలర్లు, ప్యాక్స్‌ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. 

టెండర్లు లేకుండానే ఒప్పందం...
బయో ఫెర్టిలైజర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని గతేడాది మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. పంటలకు రసాయన ఎరువులను తగ్గించేందుకు ’మార్క్‌ఫెడ్‌ గోల్డ్‌ కంపోస్ట్‌’పేరుతో సేంద్రియ ఎరువును మార్కెట్లోకి తీసుకొచ్చింది. వరి, మొక్కజొన్న, పత్తితోపాటు ఉద్యాన పంటలకూ వినియోగించేలా నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్‌ ఆధ్వర్యంలో పెద్ద ప్లాంట్‌ నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు. ఈ సంస్థతో మార్క్‌ఫెడ్‌ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎరువుల దుకాణాలతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని మార్కెఫెడ్‌ నిర్ణయించింది.

ఈ సేంద్రియ ఎరువును వరి, టమాటా, మిరప, మామిడి, బత్తాయి, నిమ్మ, నారింజ, అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌ సహా అన్నిరకాల పూలతోటలు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పసుపు, చెరకు పంటలకు ఉపయోగించడం వల్ల నేల సారవంతమవుతుందని, అధిక దిగుబడి వస్తుందని మార్క్‌ఫెడ్‌ చెబుతోంది. అయితే ఇలాంటి సేంద్రియ ఎరువులకు ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు జాతీయస్థాయిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు విశ్వ ఆగ్రోటెక్‌తో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్‌ పిలవకుండా ఏకంగా ‘మార్క్‌ఫెడ్‌ గోల్డ్‌ కంపోస్ట్‌’పేరుతో దానికి నామకరణం చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.

ఒక ప్రైవేట్‌ కంపెనీని ప్రమోట్‌ చేయడానికి ప్రభుత్వానికి చెందిన మార్క్‌ఫెడ్‌ పేరును ఉపయోగించుకోవడంపై ఉద్యోగులు, కొందరు అధికారుల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంబంధిత కంపెనీ పేరు పెట్టుకుంటే సరేననుకోవచ్చు. అంతేకానీ మార్క్‌ఫెడ్‌ గోల్డ్‌ కంపోస్ట్‌ అని నామకరణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మార్క్‌ఫెడ్‌ బోర్డులో ఆమోదం తెలుపుకోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి.

మార్క్‌ఫెడ్‌లో ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి సహా కొందరు పెద్దస్థాయి వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ కంపెనీతో వారికి లోపాయికారీ
సంబంధాలు ఉన్నాయన్న చర్చా జరుగుతోంది. అందుకే టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకొని మార్కెట్లోకి ప్రవేశపెట్టారని చెబుతున్నారు. అంతేకాదు అధిక ధరకు విక్రయించడంపై రైతులు, డీల ర్లు, ప్యాక్స్‌ నిర్వాహకులు మండిపడుతున్నారు.  

కొత్త ప్రభుత్వందృష్టిసారించాలన్న విన్నపాలు 
తమకు భారంగా మారిన గోల్డ్‌ కంపోస్ట్‌ ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. గ్రోమోర్‌ వంటి కంపెనీ ఉండగా, నిజామాబాద్‌ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కంపెనీకి ప్రాధాన్యం ఇవ్వడంపైనా విమర్శలున్నాయి. ఏ ప్రమాణాల ప్రకారం ఆ కంపెనీతో అవగాహనకు వచ్చారో కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. 

Advertisement
Advertisement