జీహెచ్‌ఎంసీ పాలనపై గోరటి పాట వైరల్‌

11 Feb, 2021 17:24 IST|Sakshi

బస్సులో వెళ్తూ గోరేటి వెంకన్న పాట

కోరస్‌ పాడిన మరో ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు

హైదరాబాద్‌: ప్రజా కవి, వాగ్గేయకారుడిగా ఉన్న గోరటి వెంకన్నను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పిలిచి మరి ఎమ్మెల్సీగా నియమించారు. శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అంతగా కనిపించని ఆయన జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో మెరిశారు. ప్రమాణస్వీకారం చేయడానికి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లంతా కలిసి బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సులో వారితో పాటు ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆసువుగా పాట ఎత్తుకున్నారు. 

‘రాములోరి సీతమ్మో సీతమ్మో’ అంటూ అప్పటికప్పుడే పాట అందుకున్నారు. పక్కన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియోద్దీన్‌ వెంకన్నను ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతుండగా పాట పాడారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా జరిగిన మార్పులను వివరిస్తూ వెంకన్న పాట పాడారు. వ్యవసాయం బాగా జరిగిందని.. అద్దాలుగా రోడ్లు ఉన్నాయని.. గులాబీ రేకుల తీరుగా నగరమెల్ల వెలుగులే అంటూ అభివర్ణిస్తూ పాట అందుకున్నారు. పచ్చనైన పార్కులు ఉద్యానవనాలు.. అంటూ పాట పాడారు. దీనికి బస్సులో ఉన్న ఎమ్మెల్సీ నారదాసు, కార్పొరేటర్లు కోరస్‌ పాడుతూ ఉత్సాహంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. 

దీనికి సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘సీఎం కేసీఆర్‌ గొప్పతనం.. పరిపాలన దక్షతను వివరిస్తూ అప్పటికప్పుడు గోరేటి వెంకన్న గారు పాట పాడారు’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు