మళ్లొస్తా నల్లమలకు.. 

27 Mar, 2022 02:50 IST|Sakshi
సంప్రదాయ రీతిలో గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న చెంచులు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: చెంచుల సంక్షేమం, జీవ నోపాధికి నిబద్ధతతో కృషి చేస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ఆదివాసీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నామని, తర్వాత మిగతా గిరిజన ఆవాసాలకూ ఈ కార్యక్రమాలను విస్తరిస్తా మని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమ లలోని లోతట్టు అటవీప్రాంతం అప్పాపూర్‌ గ్రామాన్ని గవర్నర్‌ శనివారం సందర్శించారు.

దట్టమైన అడవిలో చెంచులను వారి నివాసా ల్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంద ని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మళ్లీ ఒకసారి నల్లమల ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఓ గవర్నర్‌గా కాకుండా డాక్టర్‌గా చెంచుల ఆరోగ్యం, జీవన స్థితిగతుల పట్ల తనకెప్పుడూ ఆందోళనగా ఉంటుందన్నారు. చెంచుల ఆరోగ్య సంరక్షణతో పాటు పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్‌ ఇంటర్వెన్షన్‌ స్కీంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆస్పత్రి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు.  

6 గ్రామాలకు రూ. 1.5 కోట్లు 
నాగర్‌ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండేసి గ్రామాల చొప్పున మొ త్తం 6 గ్రామాలను దత్తత తీసుకున్నామని గవర్నర్‌ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తో ఆయా గ్రామాల్లో సోలార్‌ విద్యుత్, పాఠశా లల మరమ్మతులు, గిరిజనుల ఇళ్ల మరమ్మతు ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమాల అమలుతో పాటు ఇంటింటికీ 10 చొప్పున రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశామన్నారు.

పైలట్‌ ప్రాజెక్టు కింద 6 గ్రామాలకు రూ.1.5 కోట్లు కేటాయించామని తెలిపారు. గవర్నర్‌ పర్యటకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గైర్హాజరయ్యారు. మరోవైపు సమావేశానికి హాజరైన చెంచులకు అధికారులు భోజన వసతి కల్పించకపోవడంతో చెంచులు ఆకలితోనే వెనుదిరిగారు.  

2 గ్రామాలకు 2 మొబైల్‌ బైక్‌ అంబులెన్స్‌లు 
అప్పాపూర్‌లోని చెంచు ఆవాసాలను సందర్శించిన గవర్నర్‌.. ఇంటింటికీ మంచినీటి సరఫరాను ప్రారంభించారు. చెంచుల ఆరాధ్య దైవం బైరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలకు కుట్టుమిషన్‌ శిక్షణ కార్యక్రమంతో పాటు అప్పాపూర్, భౌరాపూర్‌ గ్రామా లకు రెండు మొబైల్‌ బైక్‌ అంబులెన్స్‌లను అం దజేశారు. ఉన్నత విద్యను చదువుతున్న చెంచు విద్యార్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం తో పాటు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.  

గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన సర్పంచ్‌
చెంచులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమ్రాబాద్‌ మండలం సార్లపల్లి సర్పంచ్‌ చిగుర్ల మల్లికార్జున్‌ వేదికపైనే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించారు. గిరిజన గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలకు విలువ లేకుండా పోయిందన్నారు. గిరిజన గ్రామాల సర్పంచులను వివిధ శాఖల అధికారులు హేళనగా చూస్తున్నారని చెప్పారు.

మిషన్‌ భగీరథ ద్వారా చెంచులకు తాగునీరు అందిస్తున్నామంటున్నారని.. అది అబద్ధమని, బోర్ల ద్వారా వచ్చే చిలుము నీటితో అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు. చెంచుపెంటల్లో సారాయి, మద్యం లేకుండా చేస్తేనే తామంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. 

మరిన్ని వార్తలు