విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యమా? | Sakshi
Sakshi News home page

విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యమా?

Published Sat, Aug 5 2023 6:08 AM

Harish Rao blasts Bhatti for misleading the House - Sakshi

  సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా ఉందని, క్రమంగా అది తీసికట్టుగా మారుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్య–వైద్యంపై శుక్రవారం శాసనసభ లో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవంగా పరిస్థితులు బాగా లేవని, తెలంగాణ వచ్చాక విద్యా రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గుతున్నాయని అంకెలతో సహా వివరించారు.

అయితే, భట్టి విక్రమార్క సభను, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం విద్యాశాఖ బడ్జెట్‌ను మాత్రమే భట్టి పేర్కొంటున్నారని, ఇతర శాఖల ద్వారా కూడా విద్యారంగానికి జరుగుతున్న కేటాయింపులను ఆయన ప్రస్తావించలేదని అన్నారు. దీనికి భట్టి జవాబు ఇస్తూ, ప్రతి సంవత్సరం బడ్జెట్‌ పద్దు పెరుగుతున్నప్పుడు, ఆ దామాషా ప్రకారం విద్యా రంగానికి కేటాయింపులు లేక పోవటం అంటే బడ్జెట్‌ తక్కువ ఇచ్చినట్టేనంటూ మళ్లీ సభ ముందు లెక్కలు ఉంచారు.   

ఇదేనా మీ స్ఫూర్తి: స్పీకర్‌పై భట్టి అసహనం.. 
తాను మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డు తగులుతుండటం, ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్‌ బెల్‌ కొడుతుండటంతో ఓ దశలో భట్టి అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఐదు నిమిషాలు మాట్లాడితే, మంత్రులు పది నిమిషాలు అడ్డుతగులుతున్నారు. వారు లేచినప్పుడల్లా మీరు వారికి మైక్‌ ఇస్తున్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి?’ అని ప్రశ్నించారు. కాగా, వచ్చే అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారో రారో తెలియదని, అంతకు మించి అయితే రారని భట్టి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement