నోటిఫికేషన్‌లో అర్హతలే అంతిమం..పిటిషనర్‌ అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు 

20 May, 2022 02:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలే అంతిమమని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదని భావిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి 2017లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. బీఈడీలో, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఒకే రకమైన సబ్జెక్టులు చదివిన వారే అర్హులన్న నిబంధన పెట్టింది. అయితే పీజీలో, బీఈడీలో వేర్వేరు సబ్జెక్టులు చదివిన వారిని కూడా అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కె.శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్‌ వాదనను సింగిల్‌ జడ్జి తోసిపుచ్చారు. దీనిపై పిటిషనర్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. సీజే జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.ఉదయశ్రీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫున డి.బాలకిషన్‌ రావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌ బయోసైన్స్, తెలుగు మెథడాలజీలో బీఈడీ చేశారని, పీజీలో కెమిస్ట్రీ చేశారని బాలకిషన్‌రావు పేర్కొన్నారు. ఇదే తరహా పిటిషన్‌ను గతంలో హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని అర్హతలే అంతిమమని తీర్పునిచ్చింది. పిటిషన్‌ను కొట్టేసింది.  

మరిన్ని వార్తలు