కస్టోడియల్‌ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి | Sakshi
Sakshi News home page

కస్టోడియల్‌ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి

Published Fri, Aug 18 2023 2:30 AM

High Court order to state government on Gachibowli incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కస్టోడియల్‌ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు..

ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్‌ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్‌ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్‌ స్పందించి కస్టోడియల్‌ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 

15 రోజులు గడువు కావాలి..
 ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖను సుమోటో రిట్‌ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement