టీఆర్‌ఎస్‌ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్‌.. నాగలితో ఎమ్మె‍ల్యే

18 Nov, 2021 12:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్‌ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్‌ 

అయితే కేసీఆర్‌తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య మహాధర్నాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌న శ‌రీరంపై వ‌డ్ల కంకుల‌ను అంకరించుకొని.. భుజంపై నాగ‌లి పెట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇదే తొలిసారి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్‌ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్‌ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్‌ బంద్‌లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్‌ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మ‌హాధ‌ర్నా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

మరిన్ని వార్తలు