Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌.. వేలాడే వంతెన ఏది?  

Published Tue, Dec 13 2022 1:04 AM

Hussain Sagar Hanging Bridge Works Pending Past 3 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేలాడే వంతెన పనులు వెక్కిరిస్తున్నాయి. మూడేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం నెలకొంది. రష్యా రాజధాని మాస్కోలోని మోస్క్వా నదిపై ‘యు’ ఆకారంలో నిర్మించిన తరహాలో పర్యాటకులను ఆకట్టుకొనేవిధంగా హుస్సేన్‌సాగర్‌లో వేలాడే వంతెనను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఇది ఓ కొలిక్కి రాలేదు. మొదట్లో కొత్త సంవత్సరంలో ఈ వంతెనను అందుబాటులోకి  తేవాలని భావించారు. కానీ మరో ఏడాది గడిచినా ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.   

అలలపై నడక.. 
- పీవీ ఘాట్‌కు, పీపుల్స్‌ ప్లాజాకు మధ్యలో ఉన్న స్థలంలో ఎకో పార్కు (లేక్‌వ్యూ)ను అభివృద్ధి చేసి ఇందులోంచి వంతెన మీదుగా సాగర్‌లోకి నడిచే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పారదర్శకమైన గాజు ఫలకలతో దీన్ని రూపొందించడం వల్ల  హుస్సేన్‌సాగర్‌ అలలపై నడు స్తున్న అనుభూతి కలుగుతుంది. ఒకవైపు  లుంబినీ పార్కు, మరోవైపు ఎన్టీఆర్‌ గార్డెన్‌తో పాటు హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కోసం ప్రతి రోజు వేలాది మంది  ఈ  ప్రాంతాన్ని సందర్శిస్తారు. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో  సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.  

- ఇలా వచ్చేవారు ఎకో పార్కుతో పాటు, వేలాడే వంతెనను కూడా సందర్శిస్తారనే ఉద్దేశంతో దీన్ని చేపట్టారు. ఈ వంతెన  పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలుగజేస్తుంది. మరోవైపు ఇటీవల ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌తో  నెక్లెస్‌ రోడ్డు ప్రాధాన్యం మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా– ఈ రేస్‌ దృష్ట్యా అప్పటి వరకు పూర్తి చేసే విధంగా అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారక స్తూపం, సెక్రటేరియట్‌  నిర్మాణ పనులు చకచకా కొనసాగుతుండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనుల్లో జాప్యం నెలకొనడం గమనార్హం.  

రూ.25 కోట్లకు చేరిన భారం.. 
ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు రూ.10 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం కారణంగా ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్లకు చేరినట్లు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో వెచి్చంచినా  పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే  విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం.    
 

Advertisement

What’s your opinion

Advertisement