తనిఖీల వీడియో వైరల్‌: ‘సోషల్‌మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’

29 Oct, 2021 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్‌లోని వాట్సాప్‌ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్‌గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ వాట్సాప్‌లో కామెంట్లు వచ్చాయి. దీనిపై నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ గురువారం స్పందించారు. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆద్యంతం సోదా చేయడం తమ విధుల్లో భాగమని పేర్కొన్నారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్‌జోన్‌ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్‌పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని వివరించారు.
చదవండి: వాట్సాప్‌ గ్రూప్‌లో గంజాయి ఆర్డర్‌ 

మరోపక్క అనుమానితులు, నిందితుల మధ్య సంబంధాలు కనిపెట్టడానికి వాట్సాప్‌ తదితరాల తనిఖీ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నప్పటికీ.. మనమంతా వాట్సాప్‌ యూనివర్సిటీలో విద్యార్థులుగా మారిపోయామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని, వాట్సాప్‌లో వచ్చే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

32 కేసులు.. 60 మంది అరెస్టు 
ఈ నెల 19 నుంచి గురువారం వరకు గంజాయి దందాకు సంబంధించి సిటీలో మొత్తం 26 కేసులు నమోదు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. దీంతో పాటు ఇతర మాదకద్రవ్యాలతో కలిపి 32 కేసుల్లో 60 మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయి కేసుల్లో 389 కేజీలు స్వా«దీనం చేసుకున్నామని, చిక్కిన వారిలో ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు ఏపీకి చెందిన వారూ ఉన్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఈ ఏడాది మొత్తం 114 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించామని, వీరిలో 31 మంది గంజాయి, డ్రగ్స్‌ కేసులకు సంబంధించిన వారన్నారు. మరో 21 మందిపై త్వరలో పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు