‘అసలు’కు ముందే ‘కొసరు’ దొరికింది!

14 Aug, 2021 07:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌లో క్యూఆర్‌ కోడ్స్‌ కీలకం

వర్చువల్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ చేసిన పోలీసులు

ఇన్వెస్ట్‌ చేస్తున్న ప్రతిసారీ మారిపోతున్న ఖాతాలు

వివరాలు కోరుతూ బ్యాంకు అధికారులకు లేఖలు

సాక్షి, హైదరాబాద్‌: ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫ్రాడ్‌లో నగర యువతి నుంచి రూ.2.5 లక్షలు గుంజిన కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వర్చువల్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆమె డబ్బులు అసలు ఏ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసుకోవడానికి సమయం పట్టే నేపథ్యంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఫలితంగా సదరు యాప్‌కు అనుసంధానించి ఉన్న మరో రెండు బ్యాంకు ఖాతాలు దొరికాయి. వీటి ఆధారంగానే గత వారం శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణ పట్టుబడ్డారు. 

వాట్సాప్‌ లింకుల ద్వారా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో భారీ స్కామ్‌లకు తెరలేపిన మాల్‌008 యాప్‌ వెనుకా చైనీయులే ఉన్నారు. వీరు అనేక మందికి ఎర వేసి డమ్మీ కంపెనీలు రిజస్టర్‌ చేయించి, వాటి ఆధారంగా కరెంట్‌ ఖాతాలు తెరిపించారు. 

క్యూఆర్‌ కోడ్స్‌ రూపంలో వసూలు 
► ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన వారి నుంచి డబ్బును క్యూఆర్‌ కోడ్స్‌ రూపంలో సేకరిస్తున్నారు. యాప్‌లోకి ప్రవేశించి ఇన్వెస్ట్‌ అనే అంశాన్ని ఎంచుకుంటే ఆ ఇన్వెస్టర్‌కు ఓ క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. దాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఇన్వెస్ట్‌ చేయిస్తున్నారు. 
► దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో డమ్మీ కంపెనీలు, కరెంట్‌ ఖాతాలు సిద్ధం చేసుకున్న చైనీయులు ఒక కస్టమర్‌ నుంచి డబ్బు గుంజేందుకు ఒక్కోసారి ఒక్కో బ్యాంకు ఖాతాను వాడుతున్నారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలి నుంచి డబ్బు దాదాపు 10 ఖాతాల్లోకి వెళ్లింది. 
►ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు తొలుత ఆయా బ్యాంకులపై దృష్టి పెట్టారు. వాటికి లేఖ రాయడం ద్వారా డబ్బు వెళ్లిన కరెంట్‌ ఖాతాల వివరాలు సంగ్రహించాలని భావించారు.  
►అయితే ఇది కొంత కాలయాపనతో కూడిన వ్యవహారం కావడంతో ఈలోపు మరికొందరు మోసపోవచ్చని భావించారు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొలిసారిగా వర్చువల్‌ డెకాయ్‌ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు.  

ఐడీ ఆధారంగా ఖాతాల వివరాలు.. 
►సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో పని చేసే ఓ కానిస్టేబుల్‌ బాధిత మహిళ నుంచి మాల్‌008కు సంబంధించిన లింకు షేర్‌ చేసుకున్నారు. అందులో తానే స్వయంగా రెండు దఫాల్లో రూ.600 చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. 
►ఆ సమయంలో వచి్చన క్యూఆర్‌ కోడ్స్‌లో సదరు బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓ ఐడీ ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌నకు సంబంధించిన దీనిని సంగ్రహించిన అధికారులు దాని అధికారులను సంప్రదించి లింకై ఉన్న ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. 
►ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్, విజయ్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్ని ంచగా రూ.15 వేల ప్రతిఫలానికి తమ ఖాతాలు చైనీయులకు ఇచి్చనట్లు అంగీకరించడంతో ఈ కేసులో నిందితులుగా మారి అరెస్టు అయ్యారు. 
►బాధిత యువతి డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆయా విభాగాలకు లేఖలు రాశారు. ఆవి అందిన తర్వాత వాటిని తెరిచిన వారినీ అరెస్టు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు