గులాబీ@ 21 | Sakshi
Sakshi News home page

గులాబీ@ 21

Published Sun, Apr 17 2022 2:43 AM

Hyderabad: KCR Announces To Celebrate TRS Foundation Day On April 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గతేడాది తరహాలోనే మాదాపూర్‌లోని హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు.

సుమారు 6 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్‌ శనివారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తన షెడ్యూల్‌ను రద్దు చేసుకుని భేటీకి హాజరయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరంలో ముఖ్య కూడళ్లు, నగర ప్రవేశ మార్గాలు, సభా ప్రాంగణం అలంకరణ, భోజన వసతి, హాజరయ్యే ప్రతినిధుల జాబితా, వాహనాల పార్కింగ్‌ వంటి అనేక అంశాలపై కేసీఆర్‌ సూచనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. 

తీర్మానాలపై సుదీర్ఘ చర్చ
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఉదయం పార్టీ అధినేత కేసీఆర్‌ స్వాగతోపన్యాసం తర్వాత కీలక తీర్మానాలను ప్రతిపాదిస్తారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 7 తీర్మానాలపై ప్లీనరీ చర్చించి ఆమోదించింది. టీఆర్‌ఎస్‌ విజయాలు, సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలు, దళితబంధు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, బీసీ కులగణన వంటి అంశాలపై గత ప్లీనరీలో ఆమోదించారు.

ఈ ఏడాది కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర తదితర 11 అంశాలపై తీర్మానాలు చేస్తారు. తీర్మాన అంశాలు, తీర్మానాల వారీగా ప్రసంగించాల్సిన వక్తల ఎంపికకు సంబంధించి కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. ఒకే దేశం, ఒకే పంటల కొనుగోలు విధానంపై తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ఈసారి రైతు నాయకులు, ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం?
గతేడాది ప్లీనరీకి పార్టీ నేతలు, టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులే హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. వ్యవస్థాపక దినోత్సవానికి రైతు ఉద్యమ నేత రాకేశ్‌ తికాయత్‌తో పాటు దేశంలోని పలు రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. వీరితో పాటు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించాల ని నిర్ణయించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు త్వరలో కేసీఆర్‌ లేదా  కేటీఆర్‌.. మంత్రులు, జిల్లాల వారీగా ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌ లో సమావేశం నిర్వహించే అవకాశముంది.

ఎవరెవరు హాజరవుతారంటే..?
రాష్ట్ర మంత్రి వర్గం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎంస్‌ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను ఆహ్వానిస్తారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. 

ప్లీనరీ షెడ్యూలు ఇదీ..
♦ఉదయం 10–11 వరకు ప్రతినిధుల నమోదు
♦11.05కు కేసీఆర్‌ పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం, అధ్యక్షుడి తొలి పలుకులు
♦11 రాష్ట్ర, జాతీయ అంశాల తీర్మానాలపై చర్చ, ఆమోదం
♦సాయంత్రం 5 గంటలకు ప్లీనరీ ముగింపు  

Advertisement

తప్పక చదవండి

Advertisement