Forest Officer Venkataiah Says Saidabad Man Fine Of Rs 62,075 For Cutting Old Neem Tree - Sakshi
Sakshi News home page

పాత వేపచెట్టు : భారీ జరిమానా

Published Tue, Feb 9 2021 10:52 AM

Hyderabad man fined Rs 62,000 for cutting old Neem tree - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ‘మొక్కే కదా అని పీకేస్తే...మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇంద్ర సినిమాలోని డైలాగ్‌ గుర్తుందా.. అచ్చంగా పర్యావరణం పట్ల ఇలాగే స్పందించాడో బాలుడు. దీంతో  42 ఏళ్ల వేపచెట్టును నరికి పారేసిన వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారీ వేపచెట్టును కొట్టివేసిన ఘటనను గమనించిన 8వ తరగతి  ఒక విద్యార్థి అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా చెట్టును నరికివేసినట్లు ధృవీకరించారు. ఇందుకు ఆ వ్యక్తికి 62,075 రూపాయల జరిమానా విధించారు. అలాగే ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఇచ్చిన బాలుడికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల నాటి పాత వేప చెట్టును నరికివేశాడు ఒకవ్యక్తి. ఇంటి నిర్మాణాకి అడ్డుగా ఉండటంతో వేరే ప్రత్యామ్నాయం వైపు ఏమాత్రం ఆలోచించలేదు. రాత్రికి రాత్రికే ఆ చెట్టును కొట్టించి, అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించడకుండా హుటాహుటిన కలపను కూడా తరలించేశారు. అయితే దీన్ని గమనించిన పిల్లవాడు అందరిలాగా తనకెందుకులే అనుకోలేదు...ఇది మామూలేలే అని అస్సలు మిన్నకుండి పోలేదు.. వెంటనే అటవీశాఖ నంబర్‌ 1800 425 5364కు ఫోన్ చేశాడు. చెట్టును నరికించిన వ్యక్తి, ఇందుకు సహాయం చేసిన ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై రూ .62,075 జరిమానా విధించినట్లు హైదరాబాద్ (తూర్పు) అటవీ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించిన విద్యార్థిని అభినందించారు. ఒక పిల్లవాడు ఫిర్యాదుపై స్పందించి, జరిమానా విధించడం విశేషమే మరి.

Advertisement
Advertisement