విలువలకు ప్రతీక.. ఎమ్మెస్సార్‌  | Sakshi
Sakshi News home page

విలువలకు ప్రతీక.. ఎమ్మెస్సార్‌ 

Published Wed, Aug 31 2022 2:11 AM

Hyderabad: MSR A Political Odyssey Book Launched - Sakshi

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): కాంగ్రెస్‌ దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్‌) విలువలకు ప్రతీకగా నిలిచారని, ఆ విలువలు ఉన్నందునే రాజకీయాల్లో సుదీర్ఘంగా రాణించారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెస్సార్‌ జీవిత చరిత్రను ఆయన అల్లుడు వామనరావు రాయగా ఆ పుస్తకాన్ని మంగళవారం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెస్సార్‌ ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడని, నీతి, నిజాయతీ గల గొప్ప నేత అని కొనియాడారు.

ఆయనను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కొత్తవారిని ఎమ్మెస్సార్‌ ఎంతగానో ప్రోత్సహించేవారని, తాను ఆయన వద్ద రాజకీయ కార్యదర్శిగా పని చేశానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. డబ్బుంటేనే రాజకీయాల్లో రాణిస్తారనే విషయాన్ని పక్కనపెట్టి ఎదిగిన గొప్ప నాయకుడు ఎమ్మెస్సార్‌ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైఎస్సార్‌ సీఎం అయినప్పుడు ఎమ్మెస్సార్‌ స్పీకర్‌ కావాలనుకున్నారని, అయితే తాను అందుకు చొరవ చూపలేకపోయానని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

ఈ విషయం తాను వైఎస్సార్‌కు కూడా చెప్పలేదన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌కు పునాది వేసింది వైఎస్సార్, ఎమ్మెస్సార్‌లేనని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని అనుబంధం ఉన్న ప్రజానాయకుడు ఎమ్మెస్సార్‌ అని, ఉన్నదున్నట్లు మాట్లాడటంలో ఆయనకు ఎవరూ సాటిరారని టీపీసీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement