36–40 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్‌ మహాగణపతి | Sakshi
Sakshi News home page

36–40 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్‌ మహాగణపతి

Published Sun, Jul 18 2021 3:28 AM

Hyderabads Khairatabad Ganesh to Be 40 Feet Tall This Year - Sakshi

సాక్షి, ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం భక్తులకు శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. గత సంవత్సరం కరోనా కారణంగా మహాగణపతిని 11 అడుగులకే పరిమితం చేసిన ఉత్సవ కమిటీ ఈసారి 36–40 అడుగుల ఎత్తుతో తయారుచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రజలను కరోనా వైరస్, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో శివుడి రుద్రావతారమైన పంచముఖాలతో నిలబడి ఉండే ఆకారంలో రూపొందిస్తున్న విగ్రహానికి ‘శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి’గా నామకరణం చేసినట్లు దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ ఆధ్వర్యంలో డిజైన్‌ రూపొందించి నమూనాను ఖైరతాబాద్‌ మహాగణపతి మంటపం వద్ద విడుదల చేశారు.

మహాగణపతికి కుడివైపున కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపున కాల నాగేశ్వరి విగ్రహాలు 15 అడుగుల ఎత్తుతో ఉంటాయి. అలాగే మహాగణపతి విగ్రహం కుడివైపు సింహం, నందీశ్వరుడు, ఎడమవైపు గుర్రం, గరుత్మంతుడు ఉంటారు. సమయం తక్కువగా ఉండటం వల్ల వెంటనే వెల్డింగ్‌ పనులు ప్రారంభించి ఆ తరువాత డిజైనింగ్‌ పనులు మొదలుపెడతామని రాజేంద్రన్‌ చెప్పారు. వినాయక చవితికి రెండు మూడు రోజుల ముందే రంగులతో మహాగణపతిని సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, దైవజ్ఞ శర్మతోపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement