‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే  | Sakshi
Sakshi News home page

‘కల్వకుంట్ల’ మళ్లీ అధికారంలోకి వస్తే అంతే..తెలంగాణ పూర్తిగా తిరోగమనంలోకే 

Published Sun, Aug 6 2023 4:17 AM

That if TRs come to power again Telangana will be in complete decline - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుంట్ల కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో పూర్తిగా తిరోగమన బాట పడుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను.. నా కుటుంబం.. అనే విధంగా సాగుతున్న కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ మీడియా, సోషల్‌ మీడియా వర్క్‌షాపులో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణను మోదీ ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకుని అభివృద్ధికి అండదండలిస్తుంటే బీఆర్‌ఎస్‌ సర్కారు దు్రష్పచారం చేస్తోందని విమర్శించా రు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలు, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఏయే రూపాల్లో నిధులు ఇచ్చామో చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. 

ఆ మోసాలను బయట పెట్టండి 
కల్వకుంట్ల కుటుంబ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు ఇతర రూపాల్లో తిప్పికొట్టాల్సిన అవసరం, బాధ్యత పార్టీనాయకులు, కార్యకర్తలపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘దళితబంధు పేరుతో.. ప్రజలను దగా చేయడం, మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు.ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ఇళ్లు మండలానికి ఇద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ.. ప్రజల మద్దతును కూడగట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు.  

బీజేపీ ఎప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో కలవదు 
‘‘గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఏ రోజు కూడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో కలవలేదు.. భవిష్యత్‌లో కలవబోదు.’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.’’12 మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం రాజీనామా చేయకుండా.. చేతి గుర్తుతో గెలిచి బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఈరోజైనా, రేపైనా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. ఈ పార్టీలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా సంతకాలు చేశాయి’అని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement