వెనక్కు తగ్గని విద్యార్థులు | Sakshi
Sakshi News home page

వెనక్కు తగ్గని విద్యార్థులు

Published Sat, Jun 18 2022 1:23 AM

IIIT Basara Students Have Been Protesting For 3 Days - Sakshi

నిర్మల్‌/బాసర/ఇందల్వాయి (నిజామాబాద్‌ రూరల్‌): తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు శుక్రవారం నాలుగో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రానున్నట్లు సమాచారం ఉండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

బారికేడ్లను గేటుకు అడ్డంగా పెట్టారు. అయినా.. అందరి కళ్లుగప్పి, పంటచేల మీదుగా ట్రాక్టర్‌లో వచ్చిన రేవంత్‌రెడ్డి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. విషయం తెలుసుకుని, విద్యార్థుల వద్దకు వెళ్లకముందే పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల దీక్షకు మద్దతుగా వర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ, ఏబీవీపీ నాయకులను కూడా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని దిలావర్‌పూర్‌ టోల్‌ప్లాజా వద్ద, ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డిని నర్సాపూర్‌లో పోలీసులు అడ్డుకున్నారు.  


ట్రిపుల్‌ఐటీ గోడదూకి ముళ్లపొదల్లో నుంచి వస్తున్న రేవంత్‌రెడ్డి 

ఆందోళనను ఆపే ప్రయత్నం.. 
రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్‌ఐటీ నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఈ క్రమంలో విద్యార్థులు యూనిఫామ్‌ వేసుకుని, ఐడీకార్డులు చూపుతూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎర్రటి ఎండలో గొడుగులు పట్టుకుని మరీ దీక్షను కొనసాగించారు. పలువురు బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు.  

చుట్టూ తిరిగి.. చేలు దాటి.. 
ఎవరూ ఊహించని విధంగా రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో అడుగు పెట్టారు. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా.. పంట చేల మీదుగా ట్రిపుల్‌ఐటీ వెనుక గోడ దూకి అందులోకి అడుగుపెట్టారు. విద్యార్థుల వైపు వస్తుండగా, ఒక్కసారి పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. బలవంతంగా ఆయనను రెండోగేటు నుంచి లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌ తరలించారు.

అక్కడి నుంచి నిజామాబాద్‌ జిల్లా మీదుగా పంపించేశారు. ‘బాసర విద్యార్థుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. వారి ఆందోళన ఆగేలా చూడాలి. ఏదైతే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారో దాన్ని పూర్తిచేయాలి’. 
– ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 

విద్యావ్యవస్థ నిర్వీర్యం
‘రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీల్లో, విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపర్చకుండా పేదవారికి విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌తో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టకుండా, అవసరమైన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తూ సీఎం కేసీఆర్‌ విద్యార్థుల కష్టాలకు కారణమవుతున్నారు.

కేసీఆర్‌కు రాజకీయ అవసరాల కోసం ప్రశాంత్‌ కిషోర్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్లతో గంటల కొద్దీ ప్రగతి భవన్‌లో చర్చించేందుకు సమయం ఉంటుంది గానీ, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించేందుకు సమయం ఎందుకు ఉండదు?. కేసీఆర్‌.. బాసర ట్రిపుల్‌ ఐటీకి మంత్రులను పంపి విద్యార్థులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నా. 
– ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద మీడియాతో రేవంత్‌ 

Advertisement
Advertisement