యూరియా సరఫరాలో కోత  | Sakshi
Sakshi News home page

యూరియా సరఫరాలో కోత 

Published Wed, Jan 24 2024 4:41 AM

Increased use of urea despite reduced cultivation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పంట పొలాల్లో అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దానివల్ల భూసారం తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల సరఫరాలో కోతలు విధించాలని నిర్ణయించింది. యూరియా వినియోగం వీలైనంత మేరకు తగ్గించేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూరియా ఎంత తగ్గిస్తే, అంతే స్థాయిలో ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

యూరియా అధిక వాడకం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, పంటలు కూడా విషపూరితమవుతున్నాయి. ఆయా ఆహార పదార్థాలు తింటున్న ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా సహా ఇతరత్రా అన్ని రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలని కేంద్రం సూచించింది. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులు, పురుగు మందులు వాడాలని తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా వాడకాలను తగ్గించేలా చూస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.  

సాగు తగ్గినా పెరిగిన యూరియా వాడకం 
రైతులు పంట పొలాల్లో యూరియాను కుమ్మరిస్తున్నారు. దీని వినియోగం ఏటా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమున్నా లేకున్నా కొందరు రైతులు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో యూరియాను విరివిగా వాడుతున్నారని అంటున్నారు. రైతులు గత ఏడాది వానాకాలం సీజన్‌లో 10.34 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను పంట పొలాల్లో వాడారని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

2022–23 వానాకాలం సీజన్‌లో 9.05 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగించగా, 2023–24 వానాకాలం సీజన్లో 1.29 లక్షల మెట్రిక్‌ టన్నులు అదనంగా వాడటం గమనార్హం. గత ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లోనే అధికంగా యూరియాను వినియోగించారు. వాస్తవానికి గత వానాకాలం సీజన్‌లో యూరియా వాడకం తగ్గుతుందని భావించారు. కానీ పెరిగింది. దీంతో కేంద్ర కేటాయింపుల కంటే ఎక్కువగా యూరియాను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే అంతకుముందు వానాకాలం సీజన్‌ కంటే గత ఏడాది వానాకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. 2022– 23 ఏడాది వానాకాలం సీజన్‌లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగు కాగా, 2023–24 వానాకాలం సీజన్‌లో 1.26 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే 21 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ యూరియా వాడకం మాత్రం 1.29 లక్షల మెట్రిక్‌ టన్నులు పెరగడం గమనార్హం.  

పలుమార్లు వర్షంతోనూ పెరుగుతున్న వాడకం 
గత ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పత్తి, ఆరుతడి పంటల సాగు ఆలస్యమైంది. కొన్నిచోట్ల మాత్రం వర్షాలు కురవడంతో రైతులు పత్తి లాంటివి వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు రాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయాయి. మొక్కలు భూమిలోనే మాడిపోయాయి. తర్వాత వర్షాలు కురిశాక మళ్లీ దున్ని విత్తనాలు చల్లారు.

ఇలా పలుమార్లు విత్తనాలు చల్లడం వల్ల యూరియా కూడా రెండు మూడుసార్లు వేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. దీంతో రెండు బస్తాలకు బదులు మూడు, నాలుగు బస్తాల వినియోగం జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట చేలల్లో నీరు నిలిచిపోయింది.

అటువంటి చోట్ల మళ్లీ విత్తనాలు వేయడం, కొన్నిచోట్ల నీటిని తొలగించడం చేశారు. దీనివల్ల కూడా యూరియాను మరోసారి వినియోగించాల్సి వచ్చింది. పైగా సబ్సిడీ వల్ల యూరియా ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులు విరివిగా వినియోగించారని చెబుతున్నారు. ఈ అదనపు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement