inter first year students who failed last year appeal for pass to inter board - Sakshi
Sakshi News home page

మమ్మల్నీ  పాస్‌ చేయరూ.. ఇంటర్ విద్యార్థుల విజ్ఞప్తి

Published Wed, Feb 3 2021 8:03 AM

Inter First Year Students Who Failed Last Year Appeal To Inter Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది మార్చిలో ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. కరోనా కారణంగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించని అధికారులు అప్పట్లో వారిని కనీస మార్కులతో పాస్‌ చేస్తామని మౌఖికంగా పేర్కొన్నారు. కానీ దానిపై అధికారిక ప్రకటన జారీ చేయలేదు. మరోవైపు గత మార్చిలోనే ఇంటర్‌ సెకండియర్‌ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1.47 లక్షల మంది విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్‌ చేశారు. దీంతో తమనూ కనీస మార్కులతో పాస్‌ చేస్తారని ఫస్టియర్‌ ఫెయిలైన విద్యార్థులు భావించారు. అయితే నేటికీ దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడం, పరీక్షల షెడ్యూల్‌ విడుదల కావడం, ఫీజు తేదీలనూ ఇంటర్‌ బోర్డు ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. 

ఒకేసారి అన్ని పరీక్షలూ రాసేదెలా? 
ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న వారిలో ఫస్టియర్‌ ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు వారు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు కరోనా కారణంగా వార్షిక పరీక్షలనే మేలో నిర్వహిస్తుండటంతో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశమే లేకుండా పోయింది. ఉన్న సమయం ద్వితీయ సంవత్సర సిలబస్‌ చదువుకునేందుకే సరిపోతుంది. కాగా, తాము రెండేళ్ల పరీక్షలను ఒకేసారి ఎలా రాస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫస్టియర్‌లో తమను పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని కోరుతున్నారు. లేకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం
ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం. పైగా ఆయా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. కాబట్టి వారికి పరీక్షలు నిర్వహించాలా లేదా ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్‌ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేస్తాం. అయితే కనీస మార్కులతో పాస్‌ చేయాలనే అంశాన్ని ప్రభుత్వానికి పంపే నివేదికలో పేర్కొంటాం.
– సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి

Advertisement
Advertisement