గవర్నర్‌గా హ్యాండిల్‌ చేయలేననుకున్నారు | Sakshi
Sakshi News home page

గవర్నర్‌గా హ్యాండిల్‌ చేయలేననుకున్నారు

Published Wed, Feb 21 2024 4:36 AM

Interesting comments by Governor Tamilisai at IITH - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్‌ అర్బన్‌: ‘నన్ను గవర్నర్‌గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్‌ బేబీ) హ్యాండిల్‌ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్‌ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్‌ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్‌గా ట్విన్స్‌ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్‌ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్‌లో క్యాంపస్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు.

గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, ఐఐటీహెచ్‌ బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు 
మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్‌లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌ భవనాన్ని.

రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్‌లోని ‘మనూ’పాలిటెక్నిక్‌ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఐనుల్‌ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు.  

నిజామాబాద్‌లో కేవీ నూతన భవనం 
నిజామాబాద్‌లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement