యోగా C/o కరీంనగర్‌.. ఎదురులేని జిల్లాగా రికార్డ్‌ | Sakshi
Sakshi News home page

యోగా C/o కరీంనగర్‌.. 2005 నుంచి 2021 వరకు ఎదురులేని జిల్లాగా రికార్డ్‌

Published Tue, Jun 21 2022 6:10 PM

International Yoga Day: Karimnagar District Wins 6 times In A Row At State Level - Sakshi

సాక్షి, కరీంనగర్‌: యావత్‌ ప్రపంచం మొత్తం ప్రస్తుతం యోగా జపం చేస్తోంది. అందరికీ యోగా అవసరం అనే కాన్సెప్ట్‌ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులు 16 ఏళ్లుగా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఆదిపత్యం చెలాయిస్తున్నారు. 2005 నుంచి 2021 వరకు 14 సార్లు చాంపియన్‌గా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 7 సార్లు రాష్ట్ర పోటీలు జరుగగా వరుసగా 6 (2020లో కోవిడ్‌ కారణంగా పోటీలు జరుగలేదు) సార్లు విజేతగా నిలిచారు.

1993లో శ్రీకారం.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 1993లో యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి వివిధ కేటగిరీల్లో బాలబాలికలకు యోగా శిక్షణ, పోటీలు నిర్వహించి అంచెలంచలుగా ప్రపంచ స్థాయిలో నలిచింది కరీంనగర్‌ జిల్లా. 2016లో అర్జెంటీనాలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో జిల్లా నుంచి సిధారెడ్డి, యమున, ప్రణీత పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. తర్వాత మలేషియా, బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో మనోజ్, దేవయ్య పాల్గొని పతకాలు సాధించగా ఇటీవల త్రివేండ్రంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ఉదయ్‌ కిరణ్‌ సత్తాచాటాడు.

వీరితో పాటుగా జాతీయ యోగా పోటీల్లో ఆనంద్‌ కిషోర్, మహేందర్, మల్లేశ్వరి, సాయిప్రవీణ్, సజన, రాజుతో పాటు సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. యోగ శిక్షకులు సంపత్‌కుమార్, కిష్టయ్య, ప్రదీప్, సత్యనారాయణ, సుష్మా, సజన్, రామకృష్ణ, మల్లేశ్వరి తదితరులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తూ జిల్లాలో ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేస్తుండడం విశేషం.

యోగా సంఘం ఆధ్వర్యంలో
జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఏటా అట్టహాసంగా జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే సంఘం ఆధ్వర్యంలో తొలిసారి 2005లో, తర్వాత 2018, 2019, 2021 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రాష్ట్ర పోటీల్లో 6 సార్లు చాంపియన్‌గా నిలిచారు. యోగా చరిత్రలో ఇప్పటికీ జిల్లా క్రీడాకారులదే పైచేయి కావడం విశేషం. 2014లో మహబూబ్‌నగర్, 2015లో నిజామాబాద్, 2016లో ఆదిలాబాద్, 2017లో కరీంనగర్, 2018 పెద్దపల్లి, 2019లో సరూర్‌నగర్, 2021లో కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర పోటీల్లో కరీంనగర్‌ జిల్లా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సష్టించింది.

Advertisement
Advertisement