ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా? | Sakshi
Sakshi News home page

ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?

Published Sun, Mar 24 2024 5:03 AM

Iyer Committee question to Irrigation Department on damage to Kaleswaram barrages: ts - Sakshi

కాళేశ్వరం బ్యారేజీలు దెబ్బతినడంపై నీటిపారుదల శాఖకు అయ్యర్‌ కమిటీ ప్రశ్న 

2019 వానాకాలం తర్వాత బ్యారేజీలకు ప్రమాద సంకేతాలు 

ప్రారంభించిన వెంటనే రక్షణ ఏర్పాట్లు ఎందుకు కొట్టుకుపోయాయి?

నాటి నుంచి గుర్తించిన లోపాలు, తీసుకున్న చర్యలను తెలపండి 

బ్యారేజీలను నిర్మించింది నీటి నిల్వకా? మళ్లింపు కోసమా? 

పలు కీలక అంశాలపై ప్రశ్నావళి ఇచ్చిన కమిటీ 

వాటికి సమాధానాలు సిద్ధం చేస్తున్న నీటి పారుదల శాఖ 

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్‌ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్‌ వాల్, లాంచింగ్‌ అప్రాన్‌ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్‌ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్‌ కవర్‌లో సమాధానాలు అందజేయాలని కోరింది. 

ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు?
బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్‌ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. 

జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు?
నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్‌ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్‌సీల నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్‌ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్‌సీ (జనరల్‌), హైడ్రాలజీ అండ్‌ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్, ఓ అండ్‌ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) చీఫ్‌ ఇంజనీర్, రామగుండం చీఫ్‌ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ విభాగం చీఫ్‌ ఇంజనీర్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్‌ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. 

సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా?
‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్పెక్షన్‌ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్‌స్ట్రక్షన్‌ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్‌ షెడ్యూలింగ్‌)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌(టీఎస్‌ఈఆర్‌ఎల్‌)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్‌ ఉన్నాయో తెలపాలని కోరింది. 

బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? 
మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్‌ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్‌ ఫీచర్స్‌)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. 

సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? 
డీపీఆర్‌ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్‌ఎంఆర్‌ఎస్, జీఎస్‌ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్‌ కమిటీ కోరింది. 

నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? 
నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్‌ జియోలాజికల్‌ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది.

లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? 
‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్‌ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement