'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం శుభపరిణామం' | Sakshi
Sakshi News home page

'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం శుభపరిణామం'

Published Mon, Mar 6 2023 12:01 AM

JNJ Housing Journalist Society Meeting On House Lands In nizampet - Sakshi

సీఎం కేసీఆర్  చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్‌జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్నారని తెలిపింది. ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందించాలని విధాన నిర్ణయం తీసుకున్న సీఎంకు సభ్యులందరూ ధన్యవాదాలు తెలియచేస్తూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.  సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని నిర్వహించారు. 

అదేవిధంగా హైదరాబాద్‌లో అర్హులైన జర్నలిస్టులందరికి స్థలాలు కల్పించే దిశగా ప్రణాళిక చేయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆదేశించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో  జేఎన్‍జే సొసైటీతో పాటు హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేని మిగతా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న కేటీఆర్  ఆలోచనలకు అనుగుణంగా ప్రెస్ అకాడమి అధ్వర్యంలో కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని సొసైటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.  జేఎన్‌జే సొసైటీకి మిగిలిన 38 ఎకరాల స్థలం వీలైనంత తొందరగా సొసైటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్, అందోల్ శాసనసభ్యుడు సీహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. 'కోట్లాది రూపాయలు చెల్లించినా దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వాలు సొసైటీకి భూమి అప్పగించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంపేట్‌లోని 32 ఎకరాలు సొసైటీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత ఆగస్టులో సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ కీలకంగా నిలిచింది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సొసైటీ తరఫున కృతఙ్ఞతలు.' తెలిపారు.  ప్రస్తుత కమిటీ నేతృత్వంలోనే పేట్ బషీరాబాద్ స్థలం సాధించాలని కోరుతూ సర్వసభ్య సమావేశం కమిటీ పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది.  ఈ సమావేశంలో సీఈఓ వంశీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్, జ్యోతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement