120 టీఎంసీలు తరలించేలా  ‘పాలమూరు’ పనులు! | Sakshi
Sakshi News home page

120 టీఎంసీలు తరలించేలా  ‘పాలమూరు’ పనులు!

Published Wed, Aug 9 2023 6:00 AM

Joint Affidavit of Central and Krishna Boards in Supreme Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు కేవలం 7.15 టీఎంసీలు అవసరం కాగా, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల తరలింపునకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణ పనులు కొనసాగిస్తోందని కృష్ణా బోర్డు సుప్రీంకోర్టుకు నివేదించింది.

శ్రీశైలం నుంచి తరలించుకోవడానికి ప్రతిపాదించిన నీటి పరిమాణంతో పోల్చితే తాగునీటి అవసరాలు చాలా స్వల్పమేనని పేర్కొంది. 7.15 టీఎంసీల తాగునీటిని తరలించుకోవాలనుకున్నా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన అన్ని జలాశయాల్లోకి కలిపి 67.97 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవ తాగునీటి అవసరాల కంటే తరలించే జలాలు ఎక్కువ అని తెలియజేసింది. ఈ మేరకు తనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ తరఫున కృష్ణా బోర్డు తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

3.4 టీఎంసీలకే 65 టీఎంసీలు నింపాలి 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 6 రిజర్వాయర్లను ప్రతిపాదించగా, చివరి కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ పనులను ఇంకా ప్రారంభించలేదు. తొలి 5 రిజర్వాయర్లలో పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు మొత్తం 65.17 టీఎంసీలను నింపిన తర్వాతే, ఈ ఐదింటి కింద తాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన మొత్తం 3.4 టీఎంసీలను (కేపీ లక్ష్మీదేవిపల్లి కింద తాగునీటి అవసరాలు 4.11 టీఎంసీలు) తరలించుకోవడానికి వీలు కలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సుప్రీంకోర్టుకు బోర్డు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు.. 

  • పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది.  
  • దీని కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్‌ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను ప్రతిపాదించింది. 
  • ఈ ఎత్తిపోతల ద్వారా తరలించే 120 టీఎంసీల్లో తాగునీటికి కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్‌ కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన ఐదు రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. 
  • పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామంటూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను సమరి్పంచింది. కానీ ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులపై బ్రిజే‹Ùకుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని గతంలోనే తిప్పి పంపాం. పనులు ఆపాలని గతంలో బోర్డు సమావేశాల సందర్భంగా తెలంగాణను కోరాం.

కేసు నేపథ్యం ఇదీ...:
పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పనులను ఆపాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశించింది. అయినా ప్రభుత్వం పనులు ఆపకపోవడంతో ఎన్టీటీ రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అలాగే తాగునీటి కోసం 7.15 టీఎంసీలను తరలించేలా పాలమూరు ఎత్తిపోతల పనులకు 2023 ఫిబ్రవరి 17న అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో ఎత్తిపోతలను తమ అనుమతి ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో లేదో చెప్పాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించింది.  ఈ నేపథ్యంలోనే కేంద్రం, బోర్డు అఫిడవిట్‌ దాఖలు చేశాయి. వాస్తవానికి ఈ నెల 4న కేసు విచారణ జరగాల్సి ఉండగా అక్టోబర్‌ 6కి వాయిదా పడింది.
 

Advertisement
Advertisement