KCR Plans To Hold Huge Public Meeting In Delhi On December 9th - Sakshi
Sakshi News home page

KCR BRS Party: సత్తా చాటేలా ఢిల్లీలో ఆవిర్భావ సభ

Published Fri, Oct 14 2022 1:11 AM

KCR plans to hold huge public meeting in delhi on december 9th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మూడు రోజులుగా రాజధాని ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ‘భారత్‌ రాష్ట్ర సమితి’తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరిస్తూ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చాలని తీర్మానించిన నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఆవిర్భావ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌ 9న జరిగే సభ దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. సభను విజయవంతం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి బలమైన పునాదులు వేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని, బుధవారం వసంత్‌ విహార్‌లోనిర్మాణంలో ఉన్న పార్టీ భవనాన్ని పరిశీలించిన కేసీఆర్‌.. గురువారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఎలా ఉండాలనే కోణంలో చర్చించినట్లు తెలిసింది.

నలుమూలల నుంచీ రాకపోకలకు వీలుగా..
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన భారీ సభల తరహాలో డిసెంబర్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల దృష్టిని ఆకర్షించేలా జన సమీకరణకు అవసరమైన కసరత్తుపై దృష్టి పెట్టారు. ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానాన్ని లేదా ఢిల్లీ సమీపంలోని పశ్చిమ యూపీలో బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించారు. రోడ్డు, రైలు మార్గంతో అనుసంధానమై దేశం నలుమూలల నుంచి రాకపోకలకు వీలుగా ఉండే ప్రాంతం ఎంపిక చేయాలని సూచించారు.

భావసారూప్య పార్టీలకు భాగస్వామ్యం
భావ సారూప్య పార్టీలు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలను కూడా సభ నిర్వహణలో భాగస్వాములు చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది. కాగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు కారు ర్యాలీ నిర్వహించిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆవిర్భావ సభకు కూడా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సభలోనే పలు పార్టీలతో పాటు వివిధ దళిత, రైతు సంఘాలు బీఆర్‌ఎస్‌లో విలీనాన్ని ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు పలు పార్టీలు, నేతలతో కేసీఆర్‌ మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. 

జాతీయ విధానాలపై మేధావులతో చర్చ
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీలు సంతోష్, దామోదర్‌రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులు సభ నిర్వహణ ఏర్పాట్లను సమన్వయం చేసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా పార్టీ జాతీయ విధానాల రూపకల్పనపై ఒకరిద్దరు రిటైర్డ్‌ ఉన్నతాధికారులు, ఆర్మీ అధికారులు, మీడియా సంస్థల అధినేతలతోనూ కేసీఆర్‌ చర్చలు సాగిస్తున్నారు.   

Advertisement
Advertisement