PM Modi Visiting Hyderabad: KCR Will Not Receive PM Modi on His Hyderabad Visit - Sakshi
Sakshi News home page

ప్రధాని రాష్ట్ర పర్యటనకు.. కేసీఆర్‌ మళ్లీ దూరం..!

Published Tue, May 24 2022 1:16 AM

Kcr Will Not Receive PM on His Hyd Visit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) పీజీ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అయితే 26న ఉదయమే కేసీఆర్‌ బెంగళూరు వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుకుంటున్న సీఎం ఈనెల 20 నుంచి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్రం ఏకపక్ష పోకడలతో తీవ్రంగా విభేదిస్తున్న కేసీఆర్‌.. బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్న సంగతి విదితమే.

ఇదే క్రమంలో బెంగళూరుకు కూడా వెళ్లనున్నారు. అయితే కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ప్రధానికి ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతం పలకడం ఇష్టం లేకనే బెంగళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్‌ (సెక్యులర్‌) నేత దేవెగౌడతో భేటీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పెట్టుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 26న ప్రధాని మోదీ పాల్గొనే ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనడం లేదన్న విషయాన్ని ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల పరోక్షంగా ధ్రువీకరించడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హాజరవుతారని ఆయన వెల్లడించారు.

గతంలోనూ డుమ్మా
కేంద్ర ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలోనే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలతో పాటు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు ప్రధాని హాజరు కాగా.. విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు కూడా ముఖ్యమంత్రి వెళ్లని విషయం విదితమే. అప్పట్లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రధానికి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

మాటల యుద్ధం షురూ
ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ దూరంగా ఉండనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల నడుమ మాటల యుద్ధం మొదలైంది. ప్రధానికి ముఖం చూపించలేకే కేసీఆర్‌ ఆయన పర్యటనకు దూరంగా ఉంటున్నారని బీజేపీ విమర్శిస్తుండగా.. ప్రధాని పర్యటనకు బీజేపీ రాజకీయ రంగు పులుముతోందని టీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తుతోంది. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకే కేసీఆర్‌ 26న బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో దేశంలో రైతు సమస్యలు, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర.. రాష్ట్రాల సంబంధాలపై మండిపడుతున్నారు. 

ప్రధాని కార్యక్రమాలివే.. 
హైదరాబాద్‌ వస్తున్న మోదీ... ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ పీజీ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఆవరణలో మొక్క నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్‌బీ ప్రత్యేక స్టాంపును, కవర్‌ను ఆవిష్కరిస్తారు. విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తారు. హైదరాబాద్‌ విద్యార్థులతోపాటు వర్చువల్‌గా మొహాలీ క్యాంపస్‌లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మోదీ టూర్, స్వాగత ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమీక్షించారు. 

Advertisement
Advertisement