బోయిన్‌పల్లి: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి

5 Jun, 2021 12:23 IST|Sakshi

కంటోన్మెంట్‌: అప్పటివరకు తోటిపిల్లలతో కలసి ఆనందంగా ఆడుకుంటున్న ఓ బాలుడిని నాలా గుంత కబళించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. శనివారం బోయిన్‌పల్లిలోని ఆనంద్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం జాజుల గ్రామానికి చెందిన ఆంజనేయులు, చంద్రకళ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి ప్రాంతానికి వలసవచ్చారు. ఆంజనేయులు ప్రైవేటు డ్రైవర్‌ కాగా, చంద్రకళ ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి చరణ్‌(9), ఆనంద్‌ సాయి(7) సంతానం.

ఆనంద్‌నగర్‌ నాలా పక్కనే ఓ ఇంట్లో ఆంజనేయులు కుటుంబం అద్దెకుంటోంది. శనివారం ఉదయం ఆనంద్‌సాయి తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న నాలా బ్రిడ్జి పునర్‌ నిర్మాణపనుల్లో భాగంగా తీసిన గుంతలో ఆనంద్‌సాయి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నాలాలో పడిపోయిన బాలుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు వచ్చి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలసి రెండుగంటలు గాలించారు. గజ ఈతగాడు ట్యాంక్‌బండ్‌ శివ నాలా అడుగుభాగం వరకు వెళ్లి ఆనంద్‌సాయి మృతదేహాన్ని వెతికి వెలికితీశాడు. 

స్థానికుల ఆగ్రహం...
బ్రిడ్జి పునర్‌ నిర్మాణపనుల్లో నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల క్రితం పనులు ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. గతేడాది వర్షాకాలంలో సమీపంలోని హస్మత్‌పేట ప్రాంతంలో నాలా ఉప్పొంగి చుట్టుపక్కల కాలనీలు, బస్తీలను ముంచెత్తింది. అదే సమయంలో ఆంజనేయులు– చంద్రకళ దంపతులు వాచ్‌మన్‌గా పనిచేసే ఆనంద్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ కూడా నీట మునిగింది.

దీంతో సమీపంలోని ఓ అద్దె ఇంట్లోకి ఆంజనేయులు కుటుంబం మారింది. కాగా, బ్రిడ్జి నిర్మాణ కాం ట్రాక్టర్‌ నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని బాలుడి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యా దు చేసింది. దీంతో కాంట్రాక్టర్‌ రాము, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిం దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్యెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు.  
చదవండి:  పోలీసులపై టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ అనుచరుల దాడి

మరిన్ని వార్తలు