Sakshi News home page

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి

Published Sat, Aug 12 2023 3:00 AM

Krishna Board reference to Genco - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్‌ ఇవ్వలేదని గుర్తు చేసింది.

సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్‌ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది.  

కృష్ణా బోర్డుకు సంబంధం లేదు  
సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్‌ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్‌కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది.  

జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది  
ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ భారీ పెరిగింది. విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్‌కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్‌ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement