యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం | Sakshi
Sakshi News home page

యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం

Published Wed, Jan 5 2022 5:23 AM

Laddu Prasad Making Machine In Yadadri Sri Laxmi Narasimha Swamy Temple - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శిం చే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా ఆధునిక యంత్రాలతో మానవప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీనరసింహసింహ స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ప్రసాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70వేలకు పైగా లడ్డూలు, రోజుకు నాలుగుసార్లు ఒకేసారి 1,000 కిలోల పులిహోర తయారు చేసేలా రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు.పులిహోరను ప్యాకింగ్‌ చేసేందుకు సుమారు రూ.5కోట్ల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. 

ప్రత్యేక మెషీన్లు..: ప్రసాదం కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషీన్‌ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకొచ్చే విధంగా పనులు పూర్తిచేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషీన్‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్‌ మాదిరిగా 12 మోటర్లతో బెల్ట్‌ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషీన్‌ వద్దకు తీసుకువెళ్లేందుకు బెల్ట్‌ను బిగించారు.

భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా 13 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదాన్ని అధికారులు హరేకృష్ణ మూమెంట్‌ ప్రతినిధులకు అప్పగించగా..గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో ప్రసాదం నాణ్యత,రుచిని పరిశీలించారు. మంగళవారం మూడోసారి ట్రయల్‌ రన్‌ చేశారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణనిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement