మేడిగడ్డపై ఎల్‌ అండ్‌ టీ యూ–టర్న్‌  | Sakshi
Sakshi News home page

మేడిగడ్డపై ఎల్‌ అండ్‌ టీ యూ–టర్న్‌ 

Published Sun, Dec 17 2023 4:32 AM

Land T construction company shied away from barrage restoration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తామని గతంలో చేసిన ప్రకటనపై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ యూ–టర్న్‌ తీసుకుంది. గత అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. సొంత ఖర్చుతోనే బ్యారేజీ పునరుద్ధరణ చేపడతామని మరుసటి రోజు ఎల్‌అండ్‌టీ జనరల్‌ మేనేజర్‌ సురే‹Ùకుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్యారేజీ కుంగిన ఘటనపై నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఎల్‌ అండ్‌ టీ జనరల్‌ మేనేజర్‌ సురేశ్ కుమార్‌తో అక్టోబర్‌ 23న జలసౌధలో సమీక్ష నిర్వహించారు.

డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ నిబంధనలో భాగంగా బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఎల్‌అండ్‌టీ సొంత ఖర్చుతో చేసేందుకు ఒప్పుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. బ్యారేజీకి సంబంధించిన రెండేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ 2022 జూన్‌ 29తో ముగిసిన నేపథ్యంలో పునరుద్ధరణ బాధ్యత తమది కాదని తాజాగా ఎల్‌అండ్‌టీ సంస్థ మాట మార్చింది. బ్లాకు పునర్నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ఈ నెల 5న తమకు లేఖ అందిందని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు ధ్రువీకరించాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే ఎల్‌ అండ్‌ టీ నుంచి లేఖ అందినట్టు చెప్పాయి. బ్యారేజీ పునరుద్ధరణ పనుల కోసం తొలుత ఎగువ నుంచి వస్తున్న వరదను దారి మళ్లించడం కోసం రూ.55.75 కోట్లతో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాల్సి ఉంటుందని, ఈ మేరకు వ్యయం భరించేందుకు ప్రభుత్వం ముందుకొస్తేనే పనులు ప్రారంభిస్తామని లేఖలో ఎల్‌ అండ్‌ టీ స్పష్టం చేయడం గమనార్హం.

బ్యారేజీ పునరుద్ధరణ పనులకు మరో రూ.500 కోట్ల వ్యయం కానుందని ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్‌ ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించామని ఎల్‌ అండ్‌ టీ పేర్కొంది. 

లేఖను దాచిపెట్టారు! 
ఎల్‌ అండ్‌ టీ రాసిన లేఖను నీటిపారుదల శాఖ రహస్యంగా ఉంచడంపై ఆరోపణలు చెలరేగాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ నెల 11న జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై ఈఎన్‌సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఉత్తమ్‌తో సహా మరో నలుగురు మంత్రులు నీటిపారుదల శాఖపై సమీక్ష జరిపారు. వాస్తవాలు దాస్తున్నారని రెండు సమీక్షల్లోనూ ఈఎన్‌సీలపై మంత్రులు మండిపడ్డారు. మంత్రులు రెండుసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎల్‌ అండ్‌ టీ లేఖ విషయాన్ని అధికారులు ప్రస్తావించలేదని తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement