ఆ నాలుగు రోజులే! | Sakshi
Sakshi News home page

ఆ నాలుగు రోజులే!

Published Wed, Oct 11 2023 6:33 AM

leaders are finalizing the dates of nominations - Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి రెండు రోజులు గడిచాయో లేదో, చాలా మంది ఆశావహులు నామినేషన్ల మీద దృష్టి సారించేశారు. నమ్మకమైన పండితులను సంప్రదించి ఏ రోజు నామినేషన్‌ వేస్తే బాగుంటుందో వాకబు చేసేస్తున్నారు. వచ్చే నెల 3 నుంచి 10వతేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఎనిమిది రోజుల్లో నాలుగు రోజులు తిథి, నక్షత్ర బలం రీత్యా కీలకంగా ఉన్నాయి. ఆ నాలుగు రోజుల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. ఇక కొందరు నామ బలం రీత్యా ఇతర రోజుల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉన్నా, ఎక్కువ మంది మాత్రం ఆ నాలుగు రోజుల్లోనే వేస్తారని అంచనా వేస్తున్నారు.      –సాక్షి, హైదరాబాద్‌

మొదటి స్థానంలో..నవంబర్‌ 3
ఉత్తర నక్షత్రంతో కూడిన గురువారం ఆ రోజు. విష్ణు తిథిగా పేర్కొనే ఏకాదశి.  ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది నామినేషన్ల ఘట్టం ముగియటానికి సరిగ్గా ముందు రోజు కావటం విశేషం.  

రెండో స్థానంలో ...నవంబర్‌ 4
పుబ్బ నక్షత్రంతో కూడిన బుధవారం. దశమి తిథి. ఆరోజు గురు, కుజ బలం బాగా ఉన్న రోజుగా పంచాంగం చెబుతోంది. ధన బలం కూడా మెండుగా ఉండే రోజుగా పండితులు పేర్కొంటున్నారు. ఆ రోజు నామినేషన్‌ వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి 
చూపుతారని చెబుతున్నారు.  

మూడో స్థానంలో...నవంబర్‌ 8  
శ్రీరామ చంద్రుల వారి నక్షత్రం అయిన పునర్వసు ఉన్న శుక్రవారం రోజు కావటంతో ఈ రోజుకు ప్రాధాన్యం ఉందని పండితులు పేర్కొంటున్నారు. నామినేషన్ల పర్వం తొలిరోజు అయిన మూడో తేదీన ముస్లిం మైనారిటీలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. వారు పవిత్రంగా భావించే శుక్రవారం కావటమే దీనికి కారణం.  

నాలుగో స్థానంలో ...నవంబర్‌ 9 
సప్తమి తిథితో కూడిన శనివారం. ఆ రోజు పునర్వసు–పుష్యమి నక్షత్రాలు ఆ రోజుపై ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ రెండు తిథులు కలిసి ఉండటం మహారాజయోగంగా భావిస్తారు. ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తారని, ఇప్పటికే నేతలు ఈమేరకు వివరాలు తెలుసుకుని ఖాయం చేసుకున్నారని ప్రముఖ జ్యోతిష పండితులు కిరణ్‌ శర్మ చెబుతున్నారు. 

మంగళవారానికే వారి మొగ్గు.. 
మంగళవారం మంగళకరమైన రోజుగా భావించి ఆ రోజే పనులు చేపట్టేందుకు మొగ్గుచూపేవారూ ఉన్నారు. ఆ కోవలో కొందరు రాజకీయ నేతలు మంగళవారం రోజే నామినేషన్లు వేస్తారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు, వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ నేత, ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఓ నియోజకవర్గానికి చెందిన నేత, బీజేపీ కీలక నేత ఒకరు, బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఓ సీనియర్‌ నేత ఇలా కొందరు ఈరోజుకు   ప్రాధాన్యం ఇస్తారు. 

అప్పుడే పరిహారాలకు కూడా ఏర్పాట్లు.. 
రాజకీయ భవిష్యత్‌ను ఓటర్లు ఎలా నిర్ణయించే అవకాశం ఉందో చెప్పమని నేతలు పండితుల వద్ద క్యూ కడుతున్నారు. పుట్టిన తేదీ,  వారి నక్షత్రం.. ఇలా గోచార బలాన్ని తెలుసుకుంటున్నారు. సిటీకి చెందిన ఓ మంత్రికి ఈసారి అనుకూల యోగం లేదన్న సమాచారంతో వారి కుటుంబం పరిహార పూజలు ప్రారంభించిందట. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఓనేత తరపున ఆయన భార్య పూజల్లో నిమగ్నమయ్యారట.   

‘‘మా స్టీరింగ్‌ మా చేతుల్లోనే ఉంది’’ కారు గుర్తు కేటీఆర్‌ మాట ఇది.  
 ‘‘డ్రైవింగ్‌ ఎవరు చేస్తుంటే, స్టీరింగ్‌ వాళ్ల చేతుల్లోనే ఉంటది? ఇందులో ఆశ్చర్యం ఏముంది?’’కామన్‌మేన్‌ సందేహం.  

‘‘అభివృద్ధికి అరడజన్‌ సూత్రాలు చాలు.. అంటే, ఆరు గ్యారంటీలు చాలు’’కాంగ్రెస్‌  
 ‘‘అరడజన్‌ సీఎంలలో అందరూ ఎలిజిబుల్స్‌... ఈ బుల్స్‌ మధ్య రేపు బుల్‌ఫైట్‌ జరిగి... రాష్ట్రం రాష్ట్రమంతా ‘బుల్‌ ఇన్‌ చైనా షాప్‌’కాదని గ్యారంటీ ఏమిటీ’’... మళ్లీ కామన్‌మేన్‌ సంశయం.  

Advertisement
Advertisement