అచ్చంపేట: త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది? | Sakshi
Sakshi News home page

అచ్చంపేట నియోజకవర్గం: ఈసారి త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది?

Published Tue, Aug 8 2023 4:08 PM

Mahabubnagar: Who Next Incumbent in Achampet Constituency - Sakshi

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా అచ్చంపేటలో ఈసారీ త్రిముఖపోటీ అనివార్యం కానుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం  చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందుకెళ్తుండగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతో పాటు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం తమకు కలిసి వస్తుందని కాంగ్రేస్ భావిస్తుంది.

నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్  నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాల్‌రాజు విజయం సాధించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణను ఓడించారు. ప్రస్తుతం  పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న గువ్వల బాల్‌రాజు మూడోసారి అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాని ఆయన వ్యవహారశైలిపై  సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్పా కొత్తగా తన మార్కు పనులు ఏమీ చేయలేదనే ప్రచారం ఉంది.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రధానంగా ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య తీరలేదు. అక్కడ వేలాది మంది రైతులకు చెందిన పోడు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి తోడు ఆయనపై పోడు రైతులు గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొందరు నేతలు కూడ ఎమ్మెల్యే వైఖరితోనే దూరమవుతున్నారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. 

పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్నిఆయనకు చెప్పే ధైర్యం చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో కూడా తలదూర్చుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకునియోజకవర్గంలో ఒక్క డబుల్‌ బెడ్‌రూం కూడా ఇవ్వలేదు. ఇళ్లస్దలాలు ఇవ్వలేదు. మాదిగా సామాజిక వర్గానికి చెందటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్‌లో గువ్వల బాల్రాజ్ కూడ ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని సోషల్‌ మీడియాలో అనేక కామెంట్స్‌ చక్కర్లు కొట్టడం గువ్వలకు ఇబ్బందిగా మారింది.

రంగంలోకి ఎంపీ కొడుకు భరత్‌ ప్రసాద్‌?
అయితే బాల్రాజ్‌ పక్కన పెడితే నాగర్‌ కర్నూల్ ఎంపీ రాములుకు సీటు ఇవ్వొచ్చని ఒకవేళ ఆయన వయస్సు మీదపడిందని భావిస్తే ఆయన కుమారుడు భరత్‌ ప్రసాద్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. భరత్ ప్రసాద్‌కు  నాగర్‌ కర్నూల్‌ జడ్పి చైర్మన్‌కి బరిలో నిలిచి చేజాయిరిపోయింది. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్‌ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో  అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో భరత్‌ ప్రసాద్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా తన తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న మంచిపేరు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ సీటు ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరీలో దిగాలనే ఆలోచనలో భరత్‌ ప్రసాద్‌  ఉన్నట్టు సమాచారం. దీంతో అధికార బీఆర్‌ఎస్‌లో నెలకొన్న  గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంశీకృష్ణ
కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్రెడ్డి కూడ ప్రత్యేక దృష్టి సారించారు.ఈసీటు తప్పకుండా గెలవాలనే యోచనలో ఉన్నారు.ఎమ్మెల్యే గువ్వలబాల్రాజ్ భూకబ్జాలు,ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే వంశీకృష్ణ భార్య,అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందనే అభిప్రాయం పార్టీ నేతలు,కార్యకర్తల్లో ఉంది.అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగసామాజిక వర్గ ఓట్లు మైనస్గా మారే అవకాశం ఉంది.

బీజేపీ నుంచి ఆ ఇద్దరిలో ఎవరూ?
బీజేపీ కూడ ఈసారి గెలుపుపే ద్యేయంగా పనిచేయాలని యోచిస్తోంది. బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్‌ మాదిగ, శ్రీకాంత్ భీమా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఎవరు, వారు   చర్యలు ప్రారంభించింది.మిగితా బీఎస్పీ,వైఎస్ఆర్టీపీ పార్టీల అభ్యర్దులు పోటీకి ఆసక్తి చూపుతున్నా వారి ప్రభావం నామమాత్రమే కానుంది.


నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు:
నియోజకవర్గంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పరిశ్రమలు లేవు అడవి విస్తీర్ణం బాగా ఉంటుంది. నియోజకవర్గంలోనే నల్లమలలో దట్టమైన అడవులు ఉన్నాయి. చిరుతలు పెద్దపులులు ఇతర వన్యప్రాణులకు నిలయం నల్లమల్ల. ఉమామహేశ్వర క్షేత్రం, నిరంజన్ షావాలి దర్గా, మద్దిమడుగు, లొద్ది మల్లయ్య, తెలంగాణ అమర్నాథ్గా పలిచే సలేశ్వరం, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు  ప్రసిద్ధిగాంచినవి.అనేక  కిలోమీటర్ల పరిధిలో దుందుభినది విస్తరించి ఉంది. ఎస్ఎల్బీసీ నక్కలగండి  సాగునీటి ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ పేరుతో పర్యాటకులను ప్రత్యేకమైన వాహనంలో అడవిలో పర్యటింప చేస్తున్నారు. కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం నియోజకవర్గం లో అధికంగా ఉంది రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుంది.

Advertisement
Advertisement