హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే

Published Sat, Oct 8 2022 2:15 AM

Mallikarjun Kharge To Visit Hyderabad On 08 October - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్‌కు రాను న్నారు. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆయన మధ్యాహ్నం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణకు చెందిన నాయకులందరూ దాదాపుగా మల్లికార్జున ఖర్గేకే మద్దతుగా నిలుస్తుండడంతో ఈ సమావేశానికి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు హాజరవుతారని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి.

అయి తే, ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కీలక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఖర్గేతో పాటు శశిథరూర్‌ కూడా పోటీలో ఉండటంతో ఇద్దరిలో ఎవరికి ఓటేయాలన్నది పూర్తిగా టీపీసీసీ ప్రతినిధుల అభీష్టమని, ఈ సమావేశానికి తాము హాజరయితే ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే వారిపై ఉంటుందనే ఆలోచనతోనే ముఖ్య నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ ఖర్గేను వ్యక్తిగతంగా కలసి మద్దతు ప్రకటించాలని భావిస్తే మాత్రం వారు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. కాగా, ఈ సమావేశాన్ని విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ మల్లురవి తీసుకున్నారు. పార్టీ నియమావళి ప్రకారం ఇప్పటికే టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన, వ్యక్తిగతంగా టీపీసీసీ ప్రతినిధులకు ఫోన్లు చేసి శనివారం జరిగే సమావేశానికి గాంధీభవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.  

అనుభవజ్ఞుడికి పట్టం కట్టాలి: మల్లు రవి 
భారత రాజకీయాల్లో, ప్రజా జీవితంలో అపార అనుభవం కలిగిన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎంపీ మల్లురవి శుక్రవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ నేతలను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యే అన్ని అర్హతలు ఖర్గేకు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement