దెయ్యం ఉందంటూ శాంతి పూజలు

29 Nov, 2021 01:00 IST|Sakshi

మామిడిగూడ హాస్టల్లో నిర్వహణ

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేశారు. వసతిగృహంలో దెయ్యం ఉం దంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.

మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. దీంతో ‘శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం’ అని  మామిడిగూడ ఆదివాసులు తెలిపారు. వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.

కరోనాతోనే పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపారు.  

మరిన్ని వార్తలు