లోకం చూడకముందే కళ్లు మూస్తున్నారు

6 Nov, 2020 08:39 IST|Sakshi

‘నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లికి చెందిన సుజాత నాలుగు రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. బిడ్డను తీసుకుని ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికిచేరుకున్నారు. అయితే ఉదయం వరకు బిడ్డను ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది.

రెండు రోజుల క్రితం బండ్లగూడకు చెందిన రాగిణి పేట్లబురుజు ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కడుపులో ఉండగా ఉమ్మనీరు తాగడంతో బిడ్డను చికిత్స కోసం నిలోఫర్‌కు సిఫార్సు చేశారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో శిశువు మృతి చెందింది‘. ఇలా ఒక్క సుజాత, రాగిణిల బిడ్డలే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న అనేక మందికి ఇదే అనుభవం ఎదురవుతుంది.  

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్‌ చిన్నపిల్లల ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం..సకాలంలో వైద్యం అందకపోవడంతో అనేక మంది శిశువులు మృత్యువాతపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ బకాయిలు పేరుకపోవడంతో ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బాధితులకు చికిత్సలను నిరాకరిస్తుండటంతో వారంతా నిలోఫర్‌ను ఆశ్రయిస్తున్నారు. సీరియస్‌ కండిషన్‌లో వస్తున్న రోగుల సంఖ్య ఇటీవల రెట్టింపైంది. ఆస్పత్రిలో వీరికి ఆశించిన స్థాయిలో వైద్యం అందకపోవడం, చికిత్సల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతోంది. ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దులోని మహారాష్ట్ర, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుండటం, నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించడం, పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడం, అవయవాల నిర్మాణం సరిగా లేకపోవడం, ఉమ్మనీరు మింగడం,  శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది చిన్నారులు చికిత్స పొందుతుంటారు. నిజానికి 2014తో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. రాజీవ్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ (ఎమర్జన్సీ వార్డు)వచ్చాక అదనంగా మరో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వెంటిలేటర్లు, ఆల్ట్రా సౌండ్, ఎక్సరే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యపోస్టులు కూడా చాలా వరకు భర్తీ అయ్యాయి. మౌలిక సదుపాయాల పెంపు తర్వాత మరణాల రేటు తగ్గాల్సిందిపోయి...ఏటా మరింత పెరుగుతుండటం తల్లిదం డ్రులకు తీవ్ర ఆందోళన కలి గిస్తుంది.  
 
సంరక్షకులే నర్సుల అవతారం.. 
ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఐఎంసీ) నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో 130 మందే ఉన్నారు. 200 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 75 మంది, జనరల్‌ వార్డులో ప్రతి ఐదుగురు శిశువులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, యాభై మందికి ఒకరు, ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌లో ప్రతి ఇద్దరు చిన్నారులకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, ఇరువై మందికి ఒక నర్సు మాత్రమే ఉంది. ప్రతి వెంటిలేటరుకు కనీసం నాలుగు రౌండ్లకు కలిపి కనీసం నలుగురు నర్సులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం పని చేస్తున్న పదిహేడు వెంటిలేటర్లకు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఆస్పత్రిలో సరిపడా నర్సులు లేకపోవడంతో ఆ బాధ్యత కూడా సంరక్షకులే నిర్వహించాల్సి వస్తోంది. వీరంతా కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకుండా పాదరక్షలతోనే వార్డుల్లోకి వెళ్తున్నారు.  ఆసుపత్రికి ప్రస్తుతం 289 మంది నర్సుల అవసరం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితం జీవో నెంబరు 88 ప్రకారం ఆ పోస్టులు మంజూరు చేసి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నియమాకాలు చేపట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 

తల్లిదండ్రులకు తప్పని గుండె కోత..
హృద్రోగ సమస్యలతో నిత్యం 100 మంది వరకు శిశువులు వస్తుంటారు. వీరికి ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయాలి.ఆస్పత్రిలో ఈ మిషన్లు లేక పోవడంతో రోగులను ఉస్మానియాకు తరలిస్తున్నారు. అప్పటికే అక్కడ రోగుల రద్దీ ఎక్కువ ఉండటంతో శిశువుల వైద్యపరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. న్యూరోసర్జరీ, న్యూరోఫిజీషియన్, నెఫ్రాలజీ, ఆర్ధో, కిడ్నీ వైద్య నిపుణులు లేకపోవడంతో ఆయా సమస్యలతో బాధపడుతున్న శిశువులను అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక టెస్టులన్నీ కేవలం గంట వ్యవధిలోనే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి అమలు కావడం లేదు. ఇన్‌ వార్డులతో పాటు క్యాజువాలిటీ, సర్జికల్, ప్రసూతి వార్డుల్లో సీనియర్‌ వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా, రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు కన్పించడం లేదు. ఒక వేళ ఉన్నా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కళ్లముందే కన్నబిడ్డ మృవాత పడుతుండటంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో వైద్యులపై దాడులకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు