అట్టుడుకుతున్న అడవి పల్లెలు!  | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న అడవి పల్లెలు! 

Published Tue, Sep 27 2022 2:44 PM

Maoists And Police Meetings At Borders of Telangana, Maharashtra and Chhattisgarh - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది.

గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్‌ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. 

క్షణక్షణం భయం భయం 
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

మావోయిస్టు స్థావరాలపై కన్ను 
కొంతకాలం నుంచి కూంబింగ్‌ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్‌ పార్క్‌ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్‌ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్‌జీ పోలీస్‌ ఫోర్స్‌ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు.  

Advertisement
Advertisement