Massive Reforms in Power Sector | Read More- Sakshi
Sakshi News home page

Power Sector: భారీ సంస్కరణలు.. అమ్మకానికి ‘లైన్లు’!

Published Mon, Oct 4 2021 1:30 AM

Massive Reforms In The Power Supply System - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: దేశంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు రంగం సిద్ధం చేసింది. ‘ఎలక్ట్రిసిటీ (ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ప్లానింగ్, డెవలప్‌మెంట్‌ అండ్‌ రికవరీ ఆఫ్‌ ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జెస్‌) రూల్స్‌–2021’ను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రాలు తమ అధీనంలోని విద్యుత్‌ సరఫరా నెట్‌వర్క్‌లను అమ్ముకోవడానికి, ఇతరుల నుంచి కొనుక్కోవడానికి.. పంచుకోవడానికి కూడా దీనితో అవకాశం ఉండనుంది. ఈ వెసులుబాట్లు రాష్ట్రాలతోపాటు విద్యుదుత్పత్తి కంపెనీలకూ వర్తించనున్నాయి.

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ లైన్ల విక్రయానికి వీలు కల్పిస్తూ కేంద్రం ఇటీవలే మార్గదర్శకాలు ఇచ్చింది. తాజాగా విద్యుత్‌ సంస్థల యాజమాన్యంలోని ట్రాన్స్‌మిషన్‌ లైన్ల విక్రయానికి వీలు కల్పించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రీజియన్‌ నుంచి మరో రీజియన్‌కు విద్యుత్‌ సరఫరాకు సరిపడా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ లభ్యత ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంది.

తెరపై కొత్త యాక్సెస్‌ విధానం 
విద్యుదుత్పత్తి కంపెనీలు తాము ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌’దేశవ్యాప్తంగా అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆధారంగా చూపి ఈ అంతర్రాష్ట ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం (లాంగ్‌ టర్మ్‌ యాక్సెస్‌) పవర్‌గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకుంటున్నాయి. అయితే కేంద్రం తాజాగా లాంగ్‌టర్మ్‌ యాక్సెస్‌కు బదులు జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌(జీఎన్‌ఏ) అనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

దీనితో విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యాన్ని పొందడం, బదిలీ చేయడం వంటివి చేయొచ్చు. స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాలతో విద్యుత్‌ కొనుగోలుకు వెసులుబాటు కలగనుంది. దీనికోసం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను చూపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధానం ద్వారా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ నిర్వహణ, చార్జీల వసూళ్లలో హేతుబద్దత వస్తుందని కేంద్రం తెలిపింది.

వసూళ్ల బాధ్యతలు పవర్‌గ్రిడ్‌కు.. 
ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థల కోసం జరిగిన ఒప్పందాలన్నీ కొత్త విధానం కింద జీఎన్‌ఏలుగా మారనున్నాయి. అంతేకాదు నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వారి నుంచి ట్రాన్స్‌మిషన్‌ చార్జీల వసూలు, బిల్లింగ్, కలెక్షన్, పంపిణీ బాధ్యతలన్నీ పవర్‌గ్రిడ్‌కు వెళ్లనున్నాయి. ఒప్పంద సామర్థ్యానికి మించి అధిక విద్యుత్‌ తీసుకున్నా, సరఫరా చేసినా 25 శాతంచార్జీలను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎన్‌ఏల అమలుపై కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది.

కొనుగోళ్లలో రోల్‌మోడల్‌గా ఏపీ
చౌక విద్యుత్‌ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఏపీలో విద్యుత్‌ సంస్థలు  అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్‌ కొనుగోలు ఖర్చును తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ విద్యుత్‌ సంస్థలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్‌ పవర్‌ ఎక్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2,342 కోట్లు ఆదా చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ రాష్ట్రాన్ని అభినందిస్తూ ఏపీని రోల్‌ మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే దేశమంతటా తాజా నిబంధనలను కేంద్రం ప్రకటించింది.    

ఎందుకీ కొత్త విధానం? 
ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ కోసం పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం, అదే సమయంలో ప్రణాళికాబద్ధంగా ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ నిర్వహణ, అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. దీనివల్ల ట్రాన్స్‌మిషన్, జనరేషన్‌ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ అందని ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవస్థను నిర్వహించడానికి కొత్త నిబంధనలు దోహదపడతాయని తెలిపింది. కొత్తగా నిర్మించే విద్యుత్‌ ప్లాంట్ల అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందని, ప్లాంట్లపై పెట్టిన పెట్టుబడులు వృథా కావని పేర్కొంది.   

Advertisement
Advertisement